Tenali Ramakrishna Stories in Telugu | తెనాలి రామకృష్ణ కథలు తెలుగులో
Tenali Ramakrishna .... Tenali Ramalingadu .... Both names are the same. In the 17th century - Sri Krishnadevaraya himself was a poet who ruled the city of 'Vidyanagaram'. He worked hard to develop the Telugu language.
In their court, there were Eight poets - Allasanipeddana, Nanditimmana, Ayyalaraju Ramabhadra, Bhattumurthy, Dhoorjati, Pingali Suranna, Mallanna, and Tenali Ramakrishna. These eight are very solid in telling poetry. That is why these eight together are called "Ashta Diggajalu". Among them, Tenali Ramakrishna is a unique poet.
Because although Ramakrishna wrote some devotional texts like "Panduranga Mahathyam", he said mainly comedy.
Another peculiarity of his is that he, like many poets and writers, did not tell or write comics, but managed them himself.
That is why he is nicknamed "Vikatakavi". The word is the same no matter where you read it. Both sides of Ramakrishna's humor are sharp. "Vikatam" means overdose .. Humor ... Satire ... Fun ... Ramalingadi's words and deeds were mostly ridiculous. Were fun. Were sharp.
Let's take a closer look at Tenali Ramakrishna his life, Stories In Telugu
1) తెనాలి రామకృష్ణుడి పరిచయం *
తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు.
వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమయిన కవి.
ఎందుకంటే రామకృష్ణుడు "పాండురంగ మాహాత్యం”వంటి కొన్ని భక్తిగంథాలు రాసినా, ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే - చాలా మంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమోకాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు.
వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు, నేటి భాషలో తెనాలి రామలింగనివి “ప్రాక్టికల్ జోక్స్” అన్నమాట. అందుకే అతనికి “వికటకవి” అని మరో మారు పేరు. ఈ మాటని ఎటునుంచి చదివినా ఒకటే. రామకృష్ణుడి హాస్యానికి రెండువైపులా పదునే. వికటం అంటే మోతాదుమించిన వేళాకోళం.. హాస్యం... వ్యంగ్యం... ఆటలు పట్టించడం... రామలింగడి మాటలూ, చేతలూ కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి. తమాషాగానే ఉండేవి. పదునుగా ఉండేవి.
రామకృష్ణుడి జీవితం మొదటినుంచీ తమాషాగానే విచిత్రంగానే సాగుతూ వచ్చింది. లేకపోతే - బడిదొంగా, చదువుకి మొద్దూ, అయిన రామకృష్ణుడు మహోన్నత వికటకవి ఎలా కాగలిగాడు?
చిన్నప్పటినుంచీ చిత్రమే అయిన అతని జీవితం గురించీ, జీవితంనిండా హాస్యాన్నీ హాస్యంలో జీవితాన్నీ నింపుకున్న - రామకృష్ణుడి గురించీ వివరంగా చూద్దాం.
2) కపి-కవి *
తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.
ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు.
“నీకు కాళికాదేవిని చూడాలనుందా?” అని అడిగాడు.
“లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని. మళ్లీ చూసేందుకేముంది?” నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు.
“బొమ్మనికాదు, అమ్మనే. నిజంగా కాళీమాతని . చూస్తే నువ్వు తట్టుకోలేవులే. భయంకరంగా ఉంటుంది కాళి. జడుసుకుంటావు” కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి.
“భయమా! జడుపా! నాకా?” పౌరుషంగా చూశాడతను సన్యాసి వైపు. “ఆ దేవిని చూబెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను” అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు.
ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి. పట్టుదల వచ్చింది. “జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటీ?” నవ్వాడు. “మరెలా కనపడుతుందీ? ఏంచేస్తే కనపడుతుందీ? చెప్పు. నీ మాటలు ఎంతవరకు నిజమో నేను చూసి తేల్చుకోవాలి కాళి ఎంత భయంకరమో... పరీక్షించాలి”
“నేను నికొమంత్రం చెబుతాను. ఆలయంలో కూర్చుని అమ్మ కనిపించేవరకూ స్మరించు. నీకయితే తొందరగానే దర్శనమిస్తుందిలే. తీరా అంబ కనిపించేసరికి భయపడకేం?..” అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి.
లేడికి లేచిందే పరుగన్నట్లు రామకృష్ణుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. ఆ కోవెల ఊరవతల ఉంది. విజయదశమికి తప్ప ఊరివారటు చూడనూ చూడరు, పట్టించుకోనూ పట్టించుకోరు. అందుచేత ఆ దారి నిర్జనంగానూ తుప్పలూ మొక్కలూ పెరిగి ఉంది. పాములు స్వేచ్చగా తిరిగేలా అనువుగా ఉంది. కాని రామకృష్ణుడు కొంచెమయినా జంకకుండా దుర్గ ఆలయానికి చేరుకుని కొలనులో మునిగి దేవి విగ్రహం ముందు కూర్చుని దీక్షగా మంత్రం జపించసాగాడు.
చీకటి పడుతోంది. కీచురాళ్లు అరుపులు మొదలెట్టాయి. రాత్రవుతున్న కొద్దీ ఆ నిర్జన ప్రదేశంలో - నక్కల వూళలు.... గుడ్లగూబల అరుపులు.
తమ కొడుకు కోసం వెదుకుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు యిలాంటి భయంకరమయిన ప్రదేశంలో ఉండొచ్చునని ఊహించక యిటురానేలేదు.
అర్ధరాత్రవుతూంది. అంధకారబంధురమయిన కాళీమాత ఆలయంలో రామకృష్ణుడు కళ్లు మూసుకుని, తదేక దీక్షతో 'దేవి' స్వరూపాన్నే మనసులో నిలుపుకుని మంత్రజపం చేయసాగాడు. ఆ బాలుడిమీద అప్పటికి దయకలిగి 'కాళీమాత' ప్రత్యక్షమయింది.
“రామకృష్ణా! నీ దీక్షకు మెచ్చితిని. పట్టుదలకు పరమానందముచెందితిని. నీకొక వరము ప్రసాదించుచున్నాను. ఏమి కావలయునో కోరుకో”అంది వాత్సల్యంగా.
మహాతేజస్సుతో వెలిగిపోతున్న జగన్మాతను చూస్తూ చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ పడిపోయాడు రామకృష్ణుడు - కొన్ని క్షణాలపాటు. “ఓహో! కుర్రవాడివి కనుక ఏమి కావలయునో తెలిసికొనలేక తత్తరపడిపోవుచున్నట్లున్నావు. ఇటు చూడు. ఈ వెండిగిన్నె యందు పాలున్నవి.
వీటిని తాగిన అఖండ విద్యావంతుడివి అవుతావు. ఈ వెండి గిన్నె యందు పెరుగు కలదు. దీనిని తాగిన అపర కుబేరుడివగుదువు. ఏది కావాలో కోరుకొనుము. విద్యయా? విత్తమా?” అడిగింది జగదంబ. “రెండు గిన్నెలూ ' నాకిమ్ము. చూసి నిర్ణయించు కొందును”
భవాని ఆ గిన్నెలు రెండింటినీ యివ్వగా... చిలిపీ, దుడుకూ అయిన రామకృష్ణుడు రెండింటిలోని పాలు, పెరుగులను చటుక్కున త్రాగివేశాడు. దాంతో - మహిషాసురమర్ధనికి ఆగ్రహం కలిగి - వంద శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. ఆ భయంకర రూపాన్ని చూసికూడా రామకృష్ణుడు కొంచెమయినా భయపడలేదు సరికదా పకపకనవ్వుతూ... “లోకమాతా! జగజ్జననీ! నా సందేహమును తీర్చుము.
ఒక్కటే ముక్కూ రెండు చేతులూ కలిగిన మాకే రొంపపడితే ముక్కుబీదుకొనుటకు చేతులు నొప్పులు పెట్టునే, నూరు శిరస్సులూ నూరు ముక్కులుకల నీకు పడిసెము పట్టినచో ఎటుల చీదుకొనెదవో, ఏలాగున బాధపడెదవో ఏమిచేసెదవో అని నా మనసున అనుమానము పీడించుచున్నది-” అన్నాడు. అతని కొంటె ప్రశ్నకీ చిలిపి సందేహానికీ దేవికి నవ్వొచ్చేసింది.
“అది సరేలే. నేనొక గిన్నెలోనిది తాగమంటే- నీవు రెండుగిన్నెలలోనివీ ఎందుకు తాగితివి? నా పట్ల అంత నిర్లక్ష్యమా?” అని గద్దించింది.
రామకృష్ణుడు జగన్మాతకు మోకరిల్లి “అమ్మా! నీవనిన నాకు భక్తియే అలక్ష్యమేమాత్రమునూ లేదు. కేవలమూ విద్యవలన ధనసంపాదన చేయుట అసాథ్యము. కేవలమూ ధనము వలననూ ప్రయోజనము న్వల్పమే. సర్వజ్ఞురాలివగు నీకు తెలియనిదేముండును? మానవజీవితము సక్రమముగానూ సుఖముగానూ ప్రయోజనకరముగానూ సాగవలెనన్న విద్యయూ విత్తమూ రెండూ అత్యవసరమే కదా?.
లక్ష్మీ, సరస్వతులిద్దరి ప్రసాదములలోనూ దేనిని తిరస్మరించిననూ తప్పే అన్నతలంపుతోనూ, అమ్మలగన్నయమ్మ అయిన మాయమ్మ యీ పుత్రునియందభిమానముతో, వాత్సల్యముతో, కరుణతోనే రెండింటినీ అందించినదని భావించి రెండింటినీ త్రాగివేసితిని. అమ్మా! నేను చేసినది నేరమే అయినచో తల్లివి కదా! ఆ తల్లి మనసుతో యీ తప్పు కాయుము” అని ప్రార్థించగా - కాళికాదేవి హృదయము కరిగిపోయినది. అతని మీద కరుణ కలిగింది. ఐతే అతని అవిధేయత శిక్షించబడాలి కదా?
అందుకని - “రామకృష్ణా! నీవు విద్వాంసుడివౌతావు. కాని వికటకవి గా మాత్రమే పేరు ప్రఖ్యాతులూ, రాజగౌరవాలూ పొందుతావు” అని దీవించి అంతర్జానమయింది.
ఇందువలననే అతను వికటకవి అయ్యాడు.
ఏదేమయినా ... కోతిచేష్టలు చేసే కుర్రవాడు, కవి కాగలడం అబ్బురమే కదా? ఇలాగ.... రామకృష్ణుడు - మొదట - కపి. తరువాత - కవి అయ్యాడు.
3) తాతా, ఊతునా? *
తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణాభారం రామకృష్ణుడి మీదపడేంది. అతని కష్టాలు ఎక్కువయ్యాయి. ఐతే అప్పటికే అతను తన హాస్యకవితా కౌశలంతో పండితులనీ, భట్రాజులనీ ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు.
ఆంధ్రభోజుడని పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం చేరగలిగితే తన సమస్యలు తీరిపోతాయని - వారి రాజధాని హంపీ విజయనగరం చేరి - రాయలవారి వద్ద తాతాచార్యులకు పలుకుబడి ఉందని విని,
“నా కెట్లయినను రాయలవారి దర్శనము కలిగించండి-” అని వారిని బతిమాలాడు. వయోవృ్ద్ధుడయిననూ.. తిరుమల తాతాచార్యులతని కేమియు సహాయము చేయక, స్పష్టంగా చెప్పక “రేపు రా మాపు రా” అంటూ కాలయాపన చేశారు. ఈ తిరుగుళ్లతోనూ రేపు, మాపులతోనూ రామకృష్ణుడి ప్రాణం అంతా విసిగిపోయింది. చివరికి అల్లసాని పెద్దన్న సాయంతో అతను రాజాశ్రయం సంపాదించగలిగాడు. ఆ రోజులలోనూ ప్రతిభకి సిఫార్సు ఉండవలసిందే. అధికారుల, ప్రభువుల దర్శనానికి ఎందరో దళారీలే!
రామకృష్ణుడికి తాతాచార్యుల మీద మనసులో కోపం ఉండిపోయింది. రామకృష్ణుడి మీద తాతాచార్యులకీ అసూయే. -(రాయలు అతని హాస్యాన్నీ కవిత్వాన్నీ తెగమెచ్చుకుంటాడని)
చాలాకాలం అనంతరం.....
ఆవేళ... నట్టింటిలో... ఉయ్యాల బల్లమీద కూర్చున్న తిరుమల తాతాచార్యులు- వీధిలోపోతున్న రామకృష్ణుడి కంటపడ్డాడు. అంతే. అతను తాంబూలం వేసుకుని - వచ్చి -“తాతా!” అని పిలిచాడు. తాతా అనేది అతని పేరులో భాగం... అతను పెద్దవాడుకూడా. “ఏమిటి?” అడిగాడు తాతాచార్యులు ఒక వైపు సందేహిస్తూనే. “ఊయల కదలుట లేదు..” “ఊపుటకు శిష్యులు లేరు. భోజనాలకి వెళ్ళారు చిరాగ్గా ఉంది”.
“ఓహో! తాతా! ఊతునా?” ఎంతో వినయంగా అడిగాడు రామకృష్ణుడు. తాతాచార్యులు పొంగిపోయారు. తల బిరుసుకు పేరుపడిన రామకృష్ణుడే - 'సేవకుడివలె ఊయలూపుతానంటున్నాడు! ఎంత గౌరవం తనకి!
“ఊం” అన్నాడు సంతోషంగానూ గర్వంగానూ.
అంతే క్షణం ఆలస్యం చెయ్యకుండా.... రామకృష్ణుడు తననోటిలోని తాంబూలమూ,. దాని రసమూ, లాలాజలమూ అన్నీ కలిపి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు.
అవమానమూ, కోపమూ భరించలేక ఛర్రున అంతెత్తున ఎగిరాడు తాత- అనూహ్యమయిన ఆ సంఘటనకి. “రామలింగా! నీకు బుద్ధిలేదా? ఒళ్లు కొవ్వెక్కినదా? నీ దుశ్చర్యని రాయలవారికి చెప్పి “శిక్షించకపోతే...” “నేనేం చేశానని? తాతా! ఊతునా? అని అడిగాను. మీరు అంతే అని అంగీకారం తెలిపారు. ఓహో! అర్ధమయింది. ఊతునా అంటే ఉమ్మేదా? అన్న భావంలో నేనడిగితే ఊయలూపడం
అనే అర్ధం తమరు తీసుకున్నారు కాబోలు. ఒకే పదానికి అనేక అర్థాలుండడంవలన జరిగిన పొరపాటిది. శిక్షించవలసివస్తే పదాలను శిక్షించాలి అనేక అర్ధాలతో ఉండి అనర్థాలకి దారి తీస్తున్నందుకు. రాయలవారికి చెప్పండి తమరు. నేనూ చెబుతాను-” అని జారుకున్నాడు రామకృష్ణుడు. అంతటితో అతనిలో తాతాచార్యుల పట్ల ప్రతీకారవాంఛ సమసిపోయింది. తాతాచార్యులకు గర్వభంగమయింది.
4) మేకా, తోకా మేకతోకా తోకమేకా *
మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు.
దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ భట్రాజు మరి కనిపించకుండాపోయాడు. ఆ పద్యం మొత్తం పాఠం :-(ఇలా ఉండొచ్చును)
మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకా మేక మేక తోక
తోక మేకకు తోక మేక తోకా తోక
తోక మేకకు తోక మేక తోక.
అర్ధం :- ఒక మేకలమంద వెళ్తుంటే - మేకలూ,.తోకలూ అలా కనపడతాయని.
5) తిలకాష్ట మహిష బంధం *
" పూర్వంలో - మామూలు 'యుద్దాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంత మందో!
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద రచించిన కవి. రాజే కవికావడంతో సాహిత్య దండయాత్రలు ఎక్కువగా జరిగేవి. అలాగ ఒకరోజు రాయలు ఆస్థానంలో ఉండగా భటుని ద్వారా ఒక లేఖ వచ్చింది. దాని సారాంశం యిది.
“నా పేరు భైరవభట్టు. కాశ్మీరు బ్రాహ్మణుడను. వేదవేదాంగములు అభ్యసించి ఆపోశనము పట్టినవాడను. దేశదేశాలు పర్యటిస్తూ ఆస్థానకవులను నా పాండిత్య ప్రతిభతో ఓడించి జయపతాక ములందుకొనుచూ వచ్చుచున్నాను. తమ కొలువులో ఎవరయినా పండితులున్నచో వారితో శాస్త్రవాదమునకు నేను సంసిద్ధంగా ఉన్నాను. నాతో వాదించుటకు ముందుకురాగల పండితులెవరైనా తమ ఆస్థానమున లేనిచో నాకు విజయపత్రి కనిప్పించండి” అన్నాడు.
రాయలు ఆ పండితుని సభలోకి తోడ్కొని రమ్మని భటుడిని పంపారు. అతడు రాగానే - గుసగుసలాడుచున్న పండితుల నడుమనుంచి రామకృష్ణుడు లేచి - భైరవభట్టు వైపూ రాయలవైపూ సభవైపూ కలయజూస్తూ,
“శాస్త్ర వాదములు జరుగకుండా విజయపత్రికను ఊరకనే యిచ్చే ఆచారమేదీ ఈ సంస్థానమునకు లేదు. వాదనలకు నేను సిద్ధమే” అని ప్రకటించాడు.
సభను మరునాటికి వాయిదా వేశారు రాజు.
రామకృష్ణుడు భైరవభట్టు బస ఎక్కడో తెలుసుకుని - ఆ సాయంత్రం - మారువేషంలో భైరవభట్టుని పలకరించడానికి చంకనమూటతో వెళ్లాడు.
“కాశ్మీరమునుండి ఎవరో మహాపండితులు విచ్చేశారని విని దర్శనం చేసుకుపోదామనివచ్చాను. ఆ పండితమాన్యులు తమరేనా? తమ నామధేయం?” అంటూ నమస్కరించాడు. “నేనే. నా పేరు భైరవభట్టు. నీ వెవరవు? నీ చంకన ఉన్నదేమిటి?” అడిగాడు పండితుడు.
“అయ్యా! నేనొక విశ్వకర్మను. కాలక్షేపము కోసము కావ్యములు చదువుచుందును. మా గురువుగారు తెనాలి రామకృష్ణులు. వారినడిగి యీ గ్రంథమును తెచ్చుకొనుచున్నాను. ఈ మూట ఆ గ్రంథమే” అన్నాడు అతివినయంగా.
“ఆ గ్రంథము పేరు?” అడిగాడు ఖైరవభట్టు.
“తిలకాష్ట మహిషబంధం.” చెప్పాడు. మారువేషంలోనున్న రామలింగడు. “ఆ! ” నివ్వెరపోయాడు ఖైరవభట్టు.
“జెన్సు, తిలకాష్ట మహిషబంధమే. ఆశీర్వదించండి శెలవు...” అని అతను వెళ్లిపోయాడు.
ఆ కశ్మీరు పండితునకేమీ తోచలేదు. తిలకాష్ట్ర మహిషబంధమను గ్రంధమొకటున్నట్లే తనకి తెలియదు, అదీకాక - ఒక సామాన్య విశ్వకర్మే యిటువంటి అసాధారణ కావ్యమును కాలక్షేపముగా చదువుచున్నాడనిన - రాయలవారి ఆస్థానములో ఎంతటి ఉద్దండ కవులుండెదరో! ఈ విశ్వకర్మ గురువు ఇంకెంతటి మహాపండితుడో? వారితో వాదనకు దిగినచో నేను నిశ్చయముగా పరాభవము నెదుర్కోవలసి వచ్చును. ఆ కర్మ ఎందులకు?.
అనుకుంటూ ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ వూరి నుంచి ఉడాయించేశాడు.
మరునాడు రాయలవారు సమయము దాటి పోవుచున్ననూ ఆ కశ్మీరు పండితుడు భైరవభట్టు సభకు రాడేమి?” అని అడుగగా రామలింగడు జరిగినది చెప్పెను.
“ఇంతకీ, రామకృష్ణా! ఆ మూటలోని తిలకాష్ట మహిషబంధమను గ్రంథము సంగతేమిటి?” అడిగాడు రాజు,
“అది గ్రంథముకాదు ప్రభూ. అసలలాటి పేరుతో ఏ గ్రంథమూలేదు”
“తిల అంటే నువ్వులు, కాష్ట అంటే కర్రలు, మహిష అంటే దున్నపోతు, బంధము అంటే కట్టుతాడు. తిలకాష్టమహిషబంధమంటే - నువ్వుల కట్టెలను కట్టిన కట్టుతాడు. ఆ మూటలోనిదదే” అన్నాడు రామకృష్ణుడు.
రాయలతోసహా సభలోనివారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు.
6) పాదుషా - భారతం *
మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలాటివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు.
శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా - దర్భారు ఉత్సవాలు ఏర్పాటు చేసి సామంతరాజులను వారి పండితులతో సహా ఆహ్వానించగా - రాయలు అష్టదిగ్గజాలను వెంటబెట్టుకుని ఢిల్లీ చేరారు. పాదుషా అందరికీ బహుమానాలిచ్చారు. రాయల ఆస్థానమందలి కవులను కలుసుకుని, వారి పాండిత్య ప్రతిభను తెలిసికొని,
“పాదుషా పక్షంవారిని పాండవులుగానూ శత్రుపక్షంవారిని కౌరవులు గానూ చిత్రీకరిస్తూ పదిరోజులలో భారతాన్ని తిరగ వ్రాయండి -” అని ఆదేశించాడు.
రాయలవారికి, వారి పండితులకీ మతిపోయింది. మహాభారతాన్ని మహమ్మదీయుల పరంగా వ్రాయడం వారికిష్టం లేదు, పైగా అలాగ పదిరోజులలో రాయడం అసాధ్యం. అందుచేత వాళ్లు తలపట్టుక్కూర్చునేసరికి,
“ఆ భారం నామీద పడెయ్యండి” అన్నాడు రామలింగడు. వారు బతుకుజీవుడా అనుకుని సరే అన్నారు. పదవరోజు రానే వచ్చేసింది.
రామకృష్ణుడు కొన్ని తాళపత్రాలను గ్రంథముగ్గా కట్టి పల్లకీలో ఉంచి మేళతాళాలతో పాదుషా వారి కొలువులో ప్రవేశించి -వారికి సలామ్ చేసి- “మహాప్రభో! భారత రచన పూర్తయినట్లే. కాని ఒక సందేహం మిగిలిపోయింది" అన్నాడు. “ఏమది?” అడిగాడు పాదుషా.
“మీరు ధర్మరాజు. మీ జనానా (అనగా మీ భార్య) ద్రౌపది. అంతవరకూ చక్కగానే ఉన్నది. కాని భారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలు కదా? మీరు కాక మీ జనానాకి మిగిలిన నలుగురి భర్తల పేర్లూ తమరు సెలవిచ్చిన తక్షణం గ్రంథములో వ్రాసి తమకు కృతినివ్వగలవాడను” అన్నాడు మహావినయంగా.
దాంతో పాదుషాకి విపరీతమయిన కోపం వచ్చింది. “భారతం యింత రంకా! అలాంటి రంకు భారతం మాకొద్దు గాక వద్దు. రాసిందంతా తగల బెట్టెయ్యండి భాయీ, మీకు మంచి నజరానా యిస్తామ్” అన్నాడు.
“జీహాం” అంటూ తక్షణం ... అక్కడే... వారి కనులముందే ఆ తాటియాకుల కట్టను తగలబెట్టేశాడు రామక్షృష్ణుడు -క్షణం ఆలస్యం చెయ్యకుండా.
పాదుషా, అష్టదిగ్గజాలకు పుష్కలంగా బహుమతులిచ్చాడు. రాయలతో సహా అందరూ తిరుగుముఖం పట్టారు - పాదుషా ఆగ్రహానికి గురికాకుండా గండం గట్టెక్కించిన రామలింగడికి కృతజ్ఞతలు తెలిపి.
7) తప్పకి చిన్నా, పెద్దా ఉండదు *
కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం. పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే ధూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగమెచ్చుకుంటూ మిగిలిన కవులను పట్టించుకోకపోవడం - వారికి చిన్నతనంగానూ అవమానంగానూ ఉండేది. ఈ పరిస్థితిని చక్కబరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు.
'కాళహస్తీశ్వర శతకం” రచించిన ధూర్జటినొసటవిభూది రేఖలతో... మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుని వలె సభకు విచ్చేసేవారు. అంత పెద్ద వయసులో... అటువంటి శృంగారాన్నెలా రాస్తున్నారా ధూర్జటి? అనుభవంలేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం అతికష్టం కదా... అని రామలింగడికి అనుమానాలు కలిగేవి. మెల్లగా ఆరా తీశాడు.
ధూర్జటి -వేశ్యాలోలుడనీ కట్టుకున్న భార్యముఖమయినా చూడడనీ తెలిసింది. ధర్మపత్ని నలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు.
ఒకనాటి రాత్రి ధూర్జటి భోజనము చేసి తన ముఖం కనపడకుండా శాలువను ముసుగేసుకుని... వడి వడిగా వేశ్యాగ్భహంలో దూరడం - రామకృష్ణుని కంటపడింది. వెంటనే అతనొక ప్రణాళిక ఆలోచించి - మరునాడు చీకటిపడుతున్న సమయానికి దూరదేశమునుండి వచ్చిన బ్రాహ్మణుని వేషం వేసుకుని వేశ్యాగృహం అరుగుమీద పడుకున్నాడు. ఆ వేశ్య అతన్నీ పలకరించి పడుకోడానికి చాప యిచ్చి లోపలికెళ్లిపోయింది.
రాత్రయిన తరవాత ధూర్జటి యథావిథిగా వచ్చి వేశ్యాగృహంలోకి దూరాడు. తెల్లవారురూమున ధూర్జటి తన యింటికి పోతూండగా - రామలింగడు- “తాతయ్యగారు వేశ్యాగృహంనుండి వచ్చుచున్నారే..” అన్ని పలకరించాడు.
ధూర్జటి తెల్లబోయి... “ఈ సంగతి ఎవరికీ చెప్పకు.. ఈ రహస్యం ఎక్కడా పొక్కనీయకు నాయనా... నీకు పుణ్యముంటుంది-” అని బతిమాలాడు - చేతులు పట్టుకుని. రామలింగడేమీ అనకుండా మౌనంగా వెళ్లిపోయాడప్పటికి.
మర్నాడు .... బితుకు బితుకుమంటూనే భువనవిజయానికి వచ్చాడు ధూర్జటి. ఆయన రావడంతోటే, - శ్రీకృష్ణదేవరాయలు పొగడుతూ,
“జవచ్యుతుడైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో
'యతులిత మాధురీ మహిమ.... (జవసత్వాలుడిగిన ధూర్జటి పదాలకింత మాధుర్యం ఎలా కలిగిందో...)
అని ఒక్కక్షణం విరామమిచ్చాడు సభవేపు చూస్తూ. ఆక్షణంలోనే రామలింగడు టక్కున లేచి-
"........ హా తెలిసెన్ భువనైక మోహనోత
దృవ సుకుమార వారవనితా జనితా ఘనతా పహార
సుధారస ధారల గ్రోలుటన్ జుమీ”
(జగదేక సుందరులు, సుకుమారులు, యౌవనవతులు అయిన వేశ్యల అధరసుధలను గ్రోలుట వల్లనే సుమా) అని పద్యాన్ని పూర్తి చేసేశాడు.
ధూర్జటి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు.
సభలో - మిగిలిన వారందరూ ఆశ్చర్యపోయారు - ఏం జరిగిందో తెలియక “సంగతేమిటి వికటకవీ” అడిగారు ఆంధ్రభోజులు.
అప్పుడు రామకృష్ణుడు ధూర్జటి వేశ్యాలోలతనూ... భార్యను నిర్లక్ష్యం చేస్తూండడాన్నీ వివరించాడు - తన, పద్యపూరణమునకు సమర్ధింపుగా.
రాయలు ధూర్జటిని పిలిపించి ఏకాంతంలో మందలించడమే కాకుండా. అతనిపై ప్రశంసా పద్యాలు చదవడం మానివేశారు.
మిగిలిన కవులు రామకృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
8) వికటికవికి రెండు వైపులా పదునే *
రామరాజుభూషణుడనే భట్టుమూర్తి - రాయలవారి ఆస్థానమున ఉండే కవే, అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి - రాయలకు అంకితం యివ్వదలిచాడు. రాయలుకి కూడా ఆ కావ్యకన్యకు కృతి భర్త కావాలనే కోరిక.
ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాశస్త్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరారు.
అప్పుడు రామకృష్ణుడు లేచి -“ప్రభూ! భట్టుమూర్తిగారి కావ్యంలో ఒకచోట -శ్రీభూపుత్రి అని ఉంది. శ్రీకారము తరవాత భకారముండరాదు. ఈ కాన్యమును కృతి స్వీకారము చేసిన -- తమ శ్రీతొలగిపోవును.” అని సూక్ష్మమయిన దృష్టితో ఆ తప్పును రాయలవారి దృష్టికి, తీసుకురాగా - రాయలవారి కావ్యమును అంకితము తీసికొనుటమానినేసిరి. ఆ కోపముతో - రామకృష్ణుని నొక్కివేయాలని ఎదురు చూడసాగాడు భట్టుమూర్తి.
అప్పుడప్పుడు రాయలవారు పండితులకి పోటీలు పెట్టి వారి వాదోపవాదాలు వింటూ ఆనందించేవారు. అలాటి సందర్భం రాగానే,
భట్టుమూర్తి - రామకృష్ణుని 'కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్” అను సమస్య పూరించమని కోరాడు. తనని పరాభవించడానికే భట్టుమూర్తి యిలా సమస్య యిచ్చాడన్న కోపంతో
“గంజాయి తాగి, తురకల
సంజాతము చేత కల్లు చవిగొన్నావా?
లంజలకొడుకా ఎక్కడ
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్?”
(గంజాయితాగి... తురకల స్నేహంలో కల్లు తాగావా? ఏనుగుల గుంపు దోమ నోట్లో ఎక్కడ జొచ్చింది లంజకొడుకా?)
అని పద్యమును పూరింపచేసేసరికి - భట్టుమూర్తి తలవంచేసుకున్నాడు.
తక్కినవారు ముక్కుమీద వేలేసుకున్నారు.
“రామకృష్ణా! సాటిపండితులను ఈ విధంగా తూలనాడడమూ అవమానించడమూ తగదు. అదే సమస్యను మహాభారతపరంగా పూరించు” అని ఆజ్ఞాపించారు రాయలు. రామకృష్ణుడు వెంటనే లేచి- యీ. విధంగా పద్యంచెప్పాడు.
“రంజన చెడి పాండవులరి
భంజనులై విరటుకొల్వు పాల్పడిరకటా!
సంజయ! విధినేమందుము
కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్”
(విధివశాత్తూ రాజ్యము పోగొట్టుకొని పాండవులు విరాటరాజు కొలువు నాశ్రయించవలసి వచ్చింది. అంటే... ఏనుగుల గుంపు దోమకుత్తుకలో ప్రవేశించడమే. విధినేమనాలి?)
ఈ పూరణమును వినడంతోటే రాయలవారెంతో సంతోషించి రామకృష్ణునకు విలువయిన బహుమతులిచ్చారు.
9) తాతాచార్యుల వారిని పరాభవించుట *
శ్రీకృష్ణదేవరాయలు గురువు తాతాచార్యులవారు. రాయలు గురువుగారిని అత్యంత గౌరవముగా చూసెడివారు. తాతాచార్యులవారు శ్రీవైష్ణవులవటంవల్ల ఆయన ఆస్థానములో స్మార్తులందరిని చిన్నచూపుతో చూచెడివాడు. రామలింగడు కూడా మరి స్మార్తుడే. ఎలాగైనా తాతాచార్యుల వారిని అవమానించాలని స్మార్తులందరూ కలసి రామలింగని శరణుజొచ్చారు.
ఒక రోజు రామలింగడు, తాతాచార్యుల వద్దకేగి “తాతా! నా ఎడమ చెయ్యి బొటనవ్రేలికి పొరబాటున గోమయము (పేడ) అంటుకొనినది. దానికి ప్రాయశ్చిత్తమేమిటి”అని యడిగెను. “నియమ నిష్టలతో నుండే సదాచార సంపన్న పండితులు యిలాంటి ఉపద్రవమొచ్చినపుడు ఎంతవరకూ గోమయమైనదో అంత భాగమును ఖండించవలెనని శాస్త్రము ఘోషించుచున్న”దనెను.
రామలింగడు బొటనవ్రేలికి కట్టుతో రాజసభకు ప్రవేశించాడు. ఆ విషయం అంతటితో అందరునూ మరిచారు. తాతాచార్యుల వార్కి తోటకూర యున్న మిక్కిలి ప్రీతి. రామలింగడు తన తోటలో పీకల లోతు గోయిత్రవ్వి పేడతో నింపి పైన తోటకూర చెట్లనునాటింపగా అది తోటకూర పంటవలె కన్పించునటుల చేశాడు.
మరునాడు ఏదో నెపముతో కవులందరినీ తనయింటికి ఆహ్వానించగా, తాతాచార్యులవారు కూడా ఏతెంచి తోటలోని తోటకూరను చూచి రామలింగనితో “తోటకూర చక్కగా పెరిగిందే బాగున్నది” అన్నాడు. “కావలసినచో మీరు తీసుకెళ్ళవచ్చు”నని రామలింగడు బదులిచ్చాడు గౌరవంగా. మాటన్నదే తడవుగా తాతాచార్యులువారు తోటకూరను తెచ్చుకొందామని దగ్గరకు వెళ్ళి ఆ గోతిలోపడి బిగ్గరగా కేకలు పెట్టసాగాడు.
10) ఆనందభట్టు *
ఒకనాడు ఆనందభట్టు అనే కవిపండితుడొకడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు వచ్చి “ప్రభూ! తిట్టుకవిత్వం చెప్పుటలో నాతో సరితూగగలవారి నెవ్వరినీ నేనెక్కడా యింతవరకూ జూడలేదు. మీరంగీకరించినచో మీ ఆస్థానమున నా కవిత్వమును ప్రదర్శించవలెనని మిక్కిలి కోరికగానున్నద”నెను.
రాయలవారికి ఆ కవిత్వముపట్ల ఆసక్తి లేకపోవుటచే అంగీకరింపక కవిగార్ని సభకురానీయకుండ ఊరకపంపుట కిష్టపడక తగిన బహుమానముల నిచ్చి పంపివేయుట మంచిదని తలచెను. ఊరక బహుమానము స్వీకరించుటకు ఆనందభట్టుకు యిష్టంలేక రాయలవద్ద ఈ క్రింది పద్యాన్ని చదివాడు.
ఊ॥ బూతుకవిత్వ వైఖరుల ప్రౌఢధము జూడల్ పొమ్మనంగ నీ కేతగుగాక. యిటుల మరెవ్వరు చెప్పుదురో నృపోత్తమా చాతురితో తెనాలి కవిసత్తముడీతడు రామకృష్ణుడీ రీతిని యూరకుండిన విరించినైనను జయింపజాలునే
రాయలవారి యనుజ్ఞలేనిదే మాట్లాడుట మర్యాదగాదని అప్పటివరకూ యూరకుండిన రామలింగడు దిగ్గునలేచి, ఈ క్రింది పద్యపాదమునిచ్చి ఆనందభట్టును పూరింపమన్నాడు.
“చూతు వెలుపుడాయటంచు సూక్తులు పలికెన్”
మంచి అర్ధముతో దానిని పూరింపలేక ఆలోచించుచూ ఆనందభట్టున్న సమయమున “ఆతులపడి"యనే పద్యాన్ని చదవగా అనందభట్టు ఆశ్చర్యము నొంది మరొక పద్యముతో రామలింగకవియొక్క ్రజ్ఞావిశేషములని బొగడి నిష్రమించాడు. రామలింగకవి యొక్క సమయస్స్ఫూర్తికీ, ప్రభుభక్తి పరాయణతకు ప్రభువు రాయలవారు మెచ్చుకొని అనేక విధముల బొగడి తగురీతిని సత్కరించాడు.
11) రాయడం మాటలు కాదు *
ఒకసారి రాయలవారి ఆస్థానానికొక పండితుడు వచ్చి “ఎవరెంత తొందరగా పద్యము చెప్పినను నేను గంటము (కలము) ఆపకుండ ఆక్షణమునే రాసెదను” అని సవాలు చేశాడు. రామలింగడు లేచి - పండితవరేణ్యా! నేనొక పద్యం చదివెదను. దానిని - నేను చెప్పినంత వేగముగానూ వ్రాసెదరా?” అని అడిగాడు. “ఓ” అని నవ్వేశాడు పండితుడు గంటనూ, తాటియాకులూ (తాళపత్రాలు) తీస్తూ..... రామలింగడు చదివాడు.
తవ్వటబాబా తలపై పువ్వుట జాబిల్లి వల్వ బూదిట చేదే బువ్వట....”
అంటూ రామలింగడు చదివేసరికి - పండితుడికి గంటం కదలలేదు.
(నిజానికీ పద్యం చదివేటప్పుడు వింతధ్వనులతోనూ విచిత్ర శబ్బాలతోనూ రాతలోకి యిమడకుండా అస్పష్టంగా ఉంటుంది. అందుకే - ఆ పండితుడు - మొదటి పదాన్ని రామలింగడు పలికిన తీరుకే తెల్లబోయి - వెర్రి మొహం వేసేశాడు.)
తన ఓటమినంగీకరించి తోకముడిచేశాడా పండితుడు.
(పై పద్యానికి తాత్పర్యం : తలమీద పువ్వు చందమామ. బట్టలు - బూడిద. ఆహారం చేదు (గరళం). ఇల్లు శృశానం. అట్టి శివునకు నమస్కారములు)
12) నల్ల కుక్క తెల్ల అవు *
శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాక తన పనిలో చాలా నిపుణుడు కలవాడు కూడా. అతను సదాచార పరాయణుడు. క్షరకుడయినా నిరంతర నిష్టాగరిష్టుడూ, దైవభక్తి పరాయణుడూ.అతని విశ్వాసమునకూ శీలమునకూ చాలా సంతోషించిన రాయల వారొకనాడు - “మంత్రీ! నీకేంకావాలో కోరుకో” అన్నారు. (మంగలిని మంత్రి అని కూడా అంటారు గౌరవంగా)
అప్పుడతను చేతులు జోడించి -ప్రభూ! తమరికి తెలియనిదేమున్నది? నేను చిన్నప్పటినుంచీ నిష్టానియమాలు పాటిస్తూ వచ్చినవాడిని. ఎలాగయినా నన్ను బ్రాహ్మణునిగా చేయించండి, చాలు. నాకు బంగారంమీదా డబ్బుమీదా ఆశాలేదు, కోరికాలేదు - బ్రాహ్మణ్యం మీద తప్ప” అని విన్నవించుకున్నాడు. తీవ్రమయిన కోరిక ప్రభావంలో అతను యుక్తాయుక్తాలు మరచి అటువంటి గడ్డుకోరిక కోరగా - కవీ, పండితుడూ అయిన రాజు కూడా -క్షవర కళ్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరచి కాబోలు, సాధ్యాసాధ్యాలను మరచి ” “సరే అలాగే” అనేశారు.
రాజపురోహితులకు కబురు వెళ్లింది. వారు వచ్చారు. “ఈ క్షురకుని బ్రాహ్మణునిగా చేయండి” ఆజ్ఞాపించారు రాయలు.
అది అసాధ్యమని వారికి తెలుసు. కాని - రాజాజ్జని కాదంటే దండన తప్పదుకదా అన్న ప్రాణభయం కొద్దీ - అయిష్టంగానే... విధిలేక తలూపారు.
అతనిని వారు నదీతీరానికి తీసుకెళ్లి ప్రతిరోజూ హోమాలూ, జపాలూ, మంత్రోచ్చ్భారణలూ చేయసాగారు. ఈ సంగతి ఎవరి చెవిన పడకూడదో వారికే తెలిసింది. అంతే రామలింగడు కూడా ఓ నల్ల కుక్కని రోజూ నది ఒడ్డుకి తీసుకెళ్లి... దానిని మాటిమాటికీ నీళ్లలో ముంచుతూ... ఓం ప్రీం హ్రీం అంటూ రాజపురోహితులకి పోటీగా అన్నట్లు బిగ్గరగా బీజాక్షరాలు పఠించడం మొదలుపెట్టాడు. ఒకవైపు క్షురకుడిని సంస్మరించ ప్రయత్నించే రాజపురోహితులు మరొకవైపు వారికి కొద్దిదూరంలోనే కుక్కని సంస్కరించ ప్రయత్నించే తెనాలి రామలింగడు.
ఒక రోజు క్షురకుడు ఎంతవరకూ విప్రుడయ్యాడో చూద్దామని రాయలవారు అక్కడికి విచ్చేవారు. అప్పటికి- ఇటు రాజపురోహితులూ, అటు రామలింగడూ బిగ్గరగా మహాహడావిడి పడిపోతూ మంత్రోచ్చారణ చేసేస్తున్నారు. వీరు క్షురకుణీ, రామలింగడు నల్ల కుక్కనీ మాటిమాటికీ నదీజలాల్లో ముంచితీస్తున్నారు.
రాయలు - రామలింగడి వద్దకు వచ్చి “ఏం చేస్తున్నావ్ రామకృష్ణా?” అని ప్రశ్నించారు, నవ్వుని బిగబట్టుకుని.
“ఈ నల్లకుక్కని తెల్ల ఆవుని చేయాలని ప్రయత్నిస్తున్నాను ప్రభూ...” అన్నాడు అతివినయంగా.
“కుక్క కుక్కయేకాని గోవెలా కాగలదు? నీకు పిచ్చికాని ఎత్తలేదు కద రామకృష్ణా?” నవ్వారాయన.
నిర్ఫీతికి నిర్మాగమాటానికీ పేరుపడిన రామకృష్ణుడు - “ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకూ పిచ్చెక్కినట్లే మరి” అన్నాడు నిస్సంకోచంగా.
“రామలింగా!” గద్దించాడు రాయలు.
“బెను ప్రభూ. మంగలిని బ్రాహ్మణునిగా చేయడం సాధ్యమయినప్పుడు, కుక్కని గోవుగా చేయడం ఎందుకు సాధ్యపడదని నేను ప్రయత్నించుచున్నాను. యథా రాజా తథా ప్రజాః (రాజుని బట్టే ప్రజలు) కదా?”
ఆ ఎత్తిపొడుపుతో రాజుకి జ్ఞానోదయమయింది.
తన తొందరపాటూ తెలివితక్కువతనమూ తెలిసివచ్చాయి.
రామలింగడు తనకి సున్నితంగానూ పరోక్షమార్గంలోనూ బుద్ధి చెప్పడానికే యిలా చేశాడని గ్రహించి,
క్షురకుడిని బ్రాహ్మణునిగా మార్చే కార్యక్రమాన్ని ఆపుచేయించాడు.
13) రామకృష్ణుడికి ఈర్శే *
నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు.
కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా - పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన 'యీర్ఫ్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం' తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే... అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు.
నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు - ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది.
“రూపాయిస్తాను కుక్కనిస్తావా? అర్ధరూపాయకు పెట్టనిస్తావా?” అని అడిగి - ఆమెనవమానించాలనుకున్నాడు. కాని - ఆమె కూడా సామాన్యురాలు కాదుకదా? రచయిత్రి కదా? అతని మాటలలోని ద్వంద్వార్థాలలోని అసభ్యతకు చెంపపెట్టు పెడుతున్నట్లు - “నీకు నేనమ్మను” అంది బదులు చెబుతున్నట్లు. రామలింగడు ఏ ఉద్ధేశంతో అడిగినా ఆమె జవాబు చక్కగా సరిపోతుంది. ఇక అతనేం మాట్లాడగలడు? తలవంచుకుని తన దారిన తనుపోయాడు. కాని, అతను సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.
ఒకనాడు పండితసభలో మొల్ల తాను వ్రాసిన పద్యంలోని మొదటిపాదం చదివింది. తక్షణమే దానినందరూ మెచ్చుకున్నారు. రామలింగడు కూడా ఆ పద్యపాదంలో లోటు ఎంచలేకపోయాడు. మాట తొందరలో,
“రెండో పాదం ఎత్తనా?” అడిగింది మొల్ల. (ఎత్తడం అనే మాటికి- పాటెత్తడం, పాటెత్తుకోడం వంటి ప్రయోగాలున్నాయి. నెల్లూరు ప్రాంతంలో యిది ద్వంద్వార్థపు మాటకాదు) అవకాశం వస్తే వదులుతాడా రామలింగడు? “వద్దువద్దు. ఇక్కడ చాలామంది మగవాళ్లున్నారు-” అనేశాడు చటుక్కున... అతివేళాకోళంగా. సాధుస్వభావీ, స్త్రీ అయిన మొల్ల సిగ్గుపడిపోయింది- ఆమె మాటలో నిజంగా తప్పులేకపోయినా తక్షణమే తలవంచుకుని సభనుంచి వెళ్లిపోయింది. ఆ స్త్రీపట్ల రామలింగనికుండే అసూయ అప్పటికి శాంతించింది.
(మహాభక్తురాలూ... చక్కని కవయిత్రీ, సాధుస్వభావీ అయిన మొల్లమీద రామలింగడికెందుకో మరి ఈ యీర్మ్య!)
14) ఇంతకంతయితే అంతకెంతో *
కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ - కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ - ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని రాయలవారికి అనుభవమే కదా.
రామకృష్ణుడికది తెలిసి - మారువేషంలో బయలుదేరాడు. ద్వారం దగ్గర భటులు అతన్నడ్డగించారు - అనుమానం వచ్చి.
ఇక లాభం లేదనుకుని -“ద్వారపాలకులూ! ప్రదర్శనానంతరం
ప్రభువులవారు పండితులకి బహుమానాలు పంచి పెడతారు. అది మీకు తెలియదేమో” అన్నాడు రామకృష్ణుడు. “పండితులకు పంచిపెడితే మా కేమిటి ఒరుగుతుంది?” అన్నారు వాళ్లు. (అప్పుడు కూడా లంచగొండితనం ఉందేదన్నమాట!)
“నాకు (ప్రదర్శన చూడడమే ప్రధానం. బహుమతులక్షరైేదు. రాయలవారు నాకేం బహుమానాలిచ్చినా వాటిని నేను ముట్టుకోను, మీ యిద్దరికీ సమంగా పంచేస్తాను” అన్నాడు. “నిజంగానా?” ఆశగా అడిగారు వాళ్లు. “దేవుడి మీదొట్టు” వాళ్లతన్ని లోపలికి పోనిచ్చారు. అప్పటికే ప్రదర్శన మొదలయింది. వేదిక మీద గోపికలు కృష్ణుడి అల్లరి పనులను యశోదకు మొరపెట్టుకుంటున్నారు. యశోద కృష్ణుణ్ని మందలిస్తున్నట్టు చక్కగా నటిస్తూంది.
ప్రదర్శన రక్తి కడుతోంది. సరిగ్గా అపుడు రామలింగడు కర్ర పట్టుకుని వేదిక మీదకెక్కి కృష్ణ పాత్రధారిని రెండు బాదులు బాదాడు. చిన్నికృష్ణుడి వేషం వేసిన అమ్మాయి కుయ్యో మొర్రోమంటూ ఏడవసాగింది.
ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. ప్రదర్శన రసాభాస అయింది. “ఏమిటీ గందరగోళం?” ఆగ్రహంగా అడిగారాంధ్రభోజులు. ప్రేక్షకులలో కొందరు - రామలింగడిని - కర్రతో సహా - వారిముందు తీసుకొచ్చి నిలబెట్టారు. “ఏమిటీ దుశ్చేష్ట? ఎందుకిలా ప్రదర్శనను రసభంగం చేశావు” కోపంగా అడిగారు రాయలవారు. “నా ఉద్దేశం రసాభాస చెయ్యాలని కాదు ప్రభూ! ప్రదర్శనని మరింత రక్తి కట్టించాలనే” వినయమూ అమాయకత్వమూ నటించాడు.
“ఏమిటి నువ్వనేది?” గద్దించాడు రాజు. “యళోద -కృష్ణుడిని చిన్నగా మందలిస్తూంటూనే ప్రదర్శన అంత బాగుందే. గట్టిగా మందలిస్తే అంటే కర్రతో కొడితే... యింకా ఎంత బాగుంటుందో అనుకున్నాను. మా పిల్లలు అల్లరిచేసినప్పుడునేను మృదువుగా మందలించను. వేపావారమ్మాయి (వేపమండ) చింతావారి చిన్నవాడి (చింత బరికెతోనే వీపు మీద వివాహం చేస్తాను” అన్నాడు.
రాయలకింకా కోపంతగ్గక “ఇతనికిరవై కొరడా దెబ్బలు శిక్ష-” అని చెప్పాడు భటులతో. రామలింగడు చెక్కు చెదరకుండా,
“ఇరవై... రెండు...ఇద్దరు అంటే ఒక్కొక్కరికి పది... రెండోవాడికి పది” అంటూ లెక్కలు వేస్తూంటే - “ఏమిటి? లెక్కలు వేస్తున్నావ్?” అడిగాడు రాజు. “మరేమీలేదు ప్రభూ. నన్ను లోపలికి వదలడానికి - ఆ ద్వారపాలకులిద్దరికీ - నాకిక్కడ లభించేవి చెరిసగం యిచ్చేస్తానని మాటివ్వవలసివచ్చింది. నా కిక్కడ లభించిన ఇరవైకొరడా దెబ్బల శిక్షా వారికి సమంగా పంచెయ్యాలి కదా? అందుకని లెక్కలు వేస్తున్నాను.” అన్నాడు మహా అమాయకంగా. రాజుగారితోపాటు మిగిలినవారికీ నవ్వాగలేదు. రాయలు రామలింగడు శిక్షరద్దు పరచి వదిలేశారు.
15) దొంగలను మించిన దొంగ *
శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు.
వారి మాటలు ప్రత్యేకంగా తోచి - “ఐతే మీరీ రాత్రి రామలింగడి యింట దొంగతనం చెయ్యండి. మీరు దొరికిపోకుండా దొంగతనం చేయగలిగితే - మీకు ఖైదునుంచి విముక్తి కలిగిస్తాను. దొరికిపోయారో - మళ్లీ మీకు చెరసాలే' అన్నారు రాజు.
చీకటి పడుతూంటే ఆ దొంగలిద్దరూ రామకృష్ణుని యిల్లు చేరి - పెరటిలోని దట్టమయిన పాదుకింద దాక్కున్నారు రాత్రయ్యాక యింటికి కన్నం వెయ్యొచ్చని, కాని రామలింగడు వారిని పసికట్టేశాడు. భార్యకేదో రహస్యంగా చెప్పి పెరటిలోనికి తీసుకువచ్చి దొంగలకు వినపడేలా,
“ఊరిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీ నగలన్నీ మూటగట్టి తీసుకురా.” అన్నాడు. “ఎందుకూ?” అమాయకంగా అడిగిందామె. “ఆ నగల మూటని నూతిలో పడేద్దాం. దొంగలభయం తీరాక తీసుకోవచ్చు. నీ నగలేకాదు యింట్లోని బంగారం, వెండి అంతాను”.
“సరే” అని కొంచెం సేపటిలో ఆవిడ మూట తెచ్చింది. దానిని నూతిలో పడేశాడు రామకృష్ణుడు. నిండానీరు ఉన్న నూతిలోపడి ఆ మూట పెద్ద శబ్దం చేసింది. ఆ దంపతులు యింట్లోకి వెళ్లిపోయారు.
“ఇది మరీ బాగుంది. వెతకబోయిన తీగ కాళ్ళకు దొరికింది. నూతిలో నీరు మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. కొంత మేరకు తోడేశాక - అప్పుడు నూతిలోకి దిగి నగలమూటని తీసుకోవచ్చు. ఏమంటావ్?” అన్నాడు చోరద్వయంలో ఒకడు.
“ఔను. అలాగే చేద్దాం. నీరు తగ్గితే తప్ప నూతిలోకి దిగలేం. ఇంకెందుకూ ఆలస్యం? వాళ్లు యింట్లోకి పోయారు. మనం నీరు తోడడం మొదలు పెడదాం. ఒక్కసారే అన్ని నగలూ అందుకోవచ్చు శ్రమలేకుండా. ఇక్కడ రెండు బొక్కెనలున్నాయి - మన కోసమే అన్నట్లు” అన్నాడు రెండో చోరుడు. ఇద్దరూ నీరుతోడడం ప్రారంభించారు.
చాటునదాగి ఉన్న రామకృష్ణుడానీటిని విశాలమయిన పెరటిలోని మిరపమొక్కలకూ, వంగమొక్కలకూ, అరటిచెట్లకూ, అన్ని పాదులకూ మళ్లించసాగాడు. వాటికి ఇక నీరు చాలనిపించాక - దొంగల వద్దకు వచ్చి,
“బాబూ! నాయనా! మా మొక్కలకి మీరు తోడిన నీరు చాలు. ఇక ఆపెయ్యండి తోడడం. మా కోసం.. మా పెరటి తోట కోసం... మీరెంతో శ్రమపడ్డారు. అందుకు మీకు చాలా కృతజ్ఞతలు” అని చెప్పేసరికి వాళ్లిద్దరూ, కంగారుగా గోడదూకారు. గోడవతల - వీధిలో గస్తీ తిరుగుతున్న రాజభటులు
వాళ్లని పట్టుకుని - మళ్లీ ఖైదులో పెట్టారు. మరుసటి రోజు -రాయలవారడుగగా రామకృష్ణుడు రాత్రి జరిగినదంతా చెప్పాడు. రాయలు రామలింగడి యుక్తికెంతో మెచ్చుకున్నారు.
16) మామిడి పళ్లూ-వాతలూ *
రాయలవారి తల్లి వృద్ధురాలు. జబ్బు చేసి - అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి “నాయనా! నేనిక ఎన్నోరోజులు బతకను. బాగా పండిన మామిడి పళ్లను తినాలని నా చివరి కోరిక.” అంది.
ఏర్పాటు చేయమన్నట్లు. తల్లి కోరిక తీర్చాలని - “ఎంత దూరమయినా వెళ్లి, ఎంత ఖర్చయినా సరే - మామిడి పళ్లు ఎలాగేనా తీసుకురండి” అని భటులని నాలుగు వేపులుగా పంపాడు రాయలు. కాని... అది మామిడి పళ్ల కాలం కాదు.
భటులు చచ్చీ చెడీ ఎలాగో ఎక్కడి నుంచో పునాసకాపు మామిడి పళ్లను తెచ్చేలోగానే మామిడి పళ్లు... మామిడి పళ్లు...” అంటూ పలవరిస్తూ వృద్ధురాలు ప్రాణం విడిచేసింది.
తల్లి కోరికను తీర్చలేనందుకు విచారిస్తూ రాచకార్యాలను చూడడం కూడా మానేసిన రాయలు వద్దకు తాతాచార్యులు వెళ్లి ... “మీ తల్లిగారి అంతిమ కోర్కెను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనో వేదన నేనర్ధం చేసుకోగలను. దీనికొక ఉపాయముంది-” అన్నాడు. “ఏమిటి?” ఆత్రంగా అడిగాడు రాజు.
“తల్లిగారికి ఉత్తరక్రియలు (పెద్దదినం) జరిపే రోజున బంగారు మామిడి పళ్లను బ్రాహ్మణులకు దానమిస్తే - పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీరి తృప్తి చెందుతారు".
ఈ మాటనచ్చాక వెంటనే స్వర్ణకారులను పిలిపించి బంగారంతో మామిడి పళ్లు తయారు చేయమని ఆజ్ఞ జారిచేశారు. బ్రాహ్మణులందరినీ రమ్మని చాటింపు వేశారు.
పెద్దన రామకృష్ణుని వద్దకు వెళ్లి -ఈ పద్దతి ఆపించాలి. లేకపోతే చాలా నష్టమొస్తుంది. రాజుగారి బొక్కసం ఖాళీ ఔతుంది. ముందుతరాలకొక చిక్కు తలకి చుట్టుకుంటుంది. దీనినాపించడానికేదో ఉపాయం చూడు.” అన్నాడు. ఇద్దరూ ప్రభుభక్తి పరాయణులేమరి.
రాయలవారు దానమిచ్చే చోటుకి దగ్గరలో ఒక కమ్మరి కొలిమి ఉంది. కుంపటిలోని నిప్పులలో రెండు బంగారు కడ్డీలు కాలుస్తూ ఒక కమ్మరిని చూపిస్తూ బంగారు మామిడి పళ్లదానాన్ని తీసుకుందుకు వస్తున్న బ్రాహ్మణులతో “మీరిక్కడెన్నివాతలు వేయించుకుంటే,
అక్కడ రాయలవారు అన్ని బంగారు మామిడిపళ్లనిస్తారు.” అంటూ నమ్మించేసరికి - వారు వాత వేయించుకుని మరీ వెళ్లసాగారు. ఒక బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండు వాతలు వేయించుకున్నాడు. నాకు రెండు బంగారు మామిడి పండ్లిప్పించండి" అన్నాడు. “వాతలేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు, బ్రాహ్మణులు తమ వాతలు చూపి జరిగినది చెప్పిరి.
కోపంపట్టలేని రాయలు రామకృష్ణుని పిలిపింది- “నేను నా తల్లిగారి ఆత్మశాంతికి సంతోషంగా బంగారు మామిడి పళ్లు దానమిస్తూంటే ఆ బ్రాహ్మణులకు నువ్వు వాతలు వేయడమేమిటి?” అని గద్దించాడు.
రామలింగడు తొణక్కుండా- “ప్రభూ! నా తల్లి వాతరోగముచే బాధపడుతూ వాతలు వేయి నాయనా తగ్గుతుంది. వాతలు వేయి నాయనా అంటూన్నా కన్నతల్లికి వాతలు వేయడమా అని సందేహించుచూ నేనే నిర్ణయమూ తీసుకునేలోగానే మరణించింది.
ఎలాగూ యింతమంది బ్రాహ్మణులను నేను పోగుచేయలేను కనుక... దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటూ... వచ్చినవారికి వాతలు వేస్తూ పరలోకమునందున్న నా తల్లి ఆత్మకు శాంతి కలిగిస్తున్నాను. ఆమె చివరి కోరిక తీరుస్తున్నాను. నా మాతృభక్తే నేరమయితే..' అని రాయలవారి ముఖంలోకి చూశాడు.
అతని మాటలలోని అంతరార్థం రాయలవారి కవగతమయింది. ఇక్కడ "బంగారు మామిడి పళ్లు ఎన్ని దానం చేసినా పరలోకానికొక్కటీచేరదు. అమ్మ నోటికందదు.
అదీకాక ఆ లోకంలోకి వెళ్లాక యిక యిలాటి వాంఛలుందనే ఉండవు. అందుచేత యిదంతా వట్టి దందగ పని: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని తనకి కనువిప్పు కలిగించడానికే రామలింగడిలా చేసుంటాడు, అని అర్థం చేసికొని ఆ రోజునుండి బంగారుమామిడపళ్లదానం ఆపుచేయించేశాడు.
17) పిచ్చి కోరిక *
తెనాలి రామకృష్ణుడి కాలంలోనే - నెల్లూరు (అప్పుడు సింహపురం అనేవారు)లో ఒక వేశ్య ఉండేది. ఆమె సంస్కృతమూ, ఆంధ్రభాషా బాగా అభ్యసించడమే కాక అపరిమితమయిన దైవభక్తి కలిగి ఉండేది. ఎందరో పండితులను తన యింటికాహ్వానించి పురాణములు చెప్పించుకొనుచూ గోష్టులతోనూ తర్మవితర్మములతో కాలం గడుపుతూండేది.
ప్రత్యక్షపురాణమంటే ఆమెకెంతో ప్రీతి. ప్రత్యక్షపురాణమంటే - కేవలమూ నోటితో పురాణం జెప్పడం కాకుండా ఆసన్నివేశాలలోని ప్రతిపాత్రా తానయి -నటనతో సహా - చేసి చూబిస్తూ పురాణం చెప్పడం. అలా అయితే ఆ సంఘటనలు కళ్లకి కట్టినట్లుంటాయని.
ఎందరు పండితులు ఎంత చక్కగా చెప్పినా ఆ వేశ్యకు నచ్చలేదు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రభువయిన శ్రీకృష్ణదేవరాయల అనుమతి పొంది, రాజభటుల సహాయంతో నెల్లూరు చేరుకుని తన రాకను ఆమెకు తెలిపాడు.
అప్పటికే రామకృష్ణుని గురించి కొంత విని ఉన్న ఆ వేశ్య ఎంతో సంతోషంతో ఆ రాత్రే పురాణపఠనానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించి - రామకృష్ణునకు ఆహ్వానం పంపింది. అతను వచ్చి వేదిక మీద కూర్చొని - “ఏ " మట్టం చెప్పేది?” అని అడిగాడు. “అయ్యా! వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు సముద్రమును లంఘించి, లంకిణిని చంపి లంకాదహనం గావిస్తాడే.. అంత వరకూ తమరు ప్రత్యక్షపురాణం చెప్పగలరు! అందామె వినయంగానూ తన మనోభీష్టాన్ని తెలుపుతూను.
రామకృష్ణుడు మనసులో తన యిష్ట దైవాలనూ సీతారాములునూ ఆంజనేయుడినీ తలచుకున్నాడు. పురాణం ప్రారంభించాడు. హనుమంతుడు సముద్రం దాటి వెళ్లే ఘట్టం వచ్చింది కొద్దిసేపట్లోనే.
“హనుమంతుడు సముద్రాన్ని యిలా లంఘించాడు-” అంటూ వేదిక మీంచి వేశ్య పడకగదిలోకి ఒక్క గెంతు గెంతాడు. వేశ్య ఆశ్చర్యంగా చూసింది.
“మైనాక పర్వతాన్ని యీ విధంగా ఎక్కాడు” అంటూ మంచం మీదకు ఎగిరాడు. అతనలా ఒక్క ఉదుటున గెంతేసరికి ఖరీదయిన పట్టెమంచం కాస్తా 'ఫెళఫెళమని విరిగిపోయింది.
అది చూస్తున్న వేశ్య అయోమయంలో పడింది. “మైనాక పర్వతం మీంచి మళ్లీ యిలా సముద్రాన్ని లంఘించాడు” అంటూ విరిగిన మంచం మీంచి - గదిలోని బల్లలొక్కొక్క దాని మీదకే - ఒక దాని మీంచొక దాని మీదకి గెంతసాగాడు. అతని గంతులకి వి సర్వనాశనమయ్యాక “ఇలాగ ఆంజనేయుడు లంకలో ప్రవేశించాడు.
అప్పుడు లంకిణి కనిపించింది” అని వేశ్య ముఖంలోకి చూస్తూ ఒక్కసారాగి.. 'ఆ లంకిణీని యిలా చావబాదాడు” అంటూ వేశ్య వీపుమీద రామకృష్ణుడు నాలుగు పిడిగుద్దులు గుద్దాడు.
వేశ్య ఆ దెబ్బలకు తాళలేక కుయ్యో మొర్రోమంటూ ఏడుస్తున్నా వినిపించుకోకుండానూ... తన నడుముకి చుట్టుకున్న వస్త్రాన్ని తోకలా తగిలించుకుని.... ఆ పిమ్మట యీ తీరున.. లంకా దహనం గావించసాగాడు.”
అంటూ తోకకి నిప్పంటించి ఆ గదిలో ఉన్న వస్త్రాలకి కర్రబీరువాలకీ, బల్లలకీ, మంచానికీ - దేనినీ- వదలకుండా అన్నిటికీ ఆ మంటనంటించాడు. నిముషంలో అవన్నీ ఒక్కెత్తున భగ్గుమంటూ మండసాగాయి.
గదినిండా మంటలు... వేడి... పాగలు... నానాభీభత్సమూ జరిగిపోతూంది. తెల్లబోయి చూస్తున్న వేశ్య - జరుగుతున్నది అర్ధమై - లబోదిబోమని ఏడుస్తూ వీధిలోకి పరుగెత్తింది. నలుగురినీ పిలిచి తనకి రామకృష్ణుడు కలగచేసిన నష్టాన్ని చెప్పుకుని ఏడ్చింది. వాళ్లు రామకృష్ణుణ్నిపట్టుకుని న్యాయం కోసం నగరాధికారులకప్పగించగా,
“ఇందులో నా తప్పేమీలేదు. ఎందరు పండితులు ఎంత చక్కగా పురాణం చెప్పినా యీమెకు నచ్చలేదు. నన్ను ప్రత్యక్షపురాణం చెప్పమంది. హనుమంతుడు లంకాదహనం గావించిన ఘట్టం చెప్పమని ఆమే మరీ మరీ కోరింది..” అన్నాడు వేశ్యవేపు చూస్తూ. “నిజమే” అందామె మెల్లగా. “కాని... నేను... ప్రత్యక్షపురాణం చెప్పమన్నానే కాని సర్వనాశనం చేయమనలేదు”
“ప్రత్యక్ష పురాణమంటే ఊరికే చెప్పడం కాదు. చేసి చూబెట్టడం కూడా. మామూలు పురాణ పఠనానికీ ప్రత్యక్షపురాణానికీ అదే తేడా” అన్నాడు రామకృష్ణుడు”. ఆమె కోరిందే నేను నెరవేర్చాను. కోరరాని కోరిక కోరి అది తీరినందుకు విచారిస్తే ఎలా?”
అధికారులకి రామకృష్ణుడి మాటలలోనే సబబు కనిపించింది.
“ఇక నుంచయినా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకు. ఇంటిమీదకు తెచ్చుకోకు. తిన్నగా ఉండు-” అంటూ ఆమెనే చివాట్లు పెట్టి రామకృష్ణుడిని సగౌరవంగా సాగనంపారు.
18) నూతుల పెళ్ళి *
శ్రీకృష్ణదేవరాయలు కర్నాటక దేశాన్ని పాలించే కాలంలో ఉత్తర హిందూ దేశాన్నంతటినీ మహమ్మదీయులు పరిపాలించేవారు. ఆనాటి ఢిల్లీ పాదుషా ఎంతో ధనము ఖర్చు చేసి ఒక బావిని తవ్వించాడు. అది చాలా అందంగా నిర్మించబడింది.
హిందువులు - దేవాలయం కట్టించినా నూతిని తవ్వించినా ప్రతిష్ట అనే కార్యక్రమం జరుపుతారు. ఐతే - ఢిల్లీపాదుషా తాను అత్యంత సుందరంగా నిర్మించిన బావికి పెళ్లిచేయాలని తలపెట్టాడు. ముహూర్తం పెట్టించి - తమ సామంత రాజులందరికీ యిలా ఆహ్వానాలు పంపాడు.
“మేము నిర్మించిన ఈ దిగుడుబావికి పెండ్లి చేయుచున్నాము. కనుక మీ దేశములోని బావులన్నిటినీ ఆ పెండ్లికి పంపించండి”.
ఆ ఆహ్వాన లేఖనందుకున్న రాయలుకి ఆశ్చర్యంతో మతిపోయింది. అక్కడ బావికి పెండ్లి! ఇక్కడ నుంచి బావులు వెళ్లడం - ఏమిటిది? ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. ఢిల్లీ పాదుషానుంచి వచ్చింది.
తిమ్మరుసును సలహా అడిగారు ఏంచేయాలని. ఆయనేమీ ఉపాయం చెప్పలేకపోయాడు. అప్పుడు రామకృష్ణుడికి కబురంపి “ఈ ఆహ్వానానికేం చేయాలో తోచక బెంగతో భోజనం కూడా సయించడం లేదు” అంటూ లేఖని చూపించారు.
చదివి - “ఓస్! ఇంతేకదా? అని తేలిగ్గా తీసి పారేస్తూ” దీనికి జవాబు, నేను చెబుతాను. ఇలా రాయించండి” అంటూ చెప్పసాగాడు.
“......పాదుషావారందించిన అహ్వన పత్రిక అందింది. ఎంతో ఆనందించినాము. మీ ఆజ్ఞ ప్రకారం మా దేశంలోని బావులన్నిటికీ తమ సందేశం వినిపించినాము. ఐతే... మీ బావులు స్వయముగా ఆహ్వానము వ్రాసి పంపలేదని అవన్నియు కోపగించినట్లున్నవి.
అందుచేత మీ బావులలో కనీసమొకటయినను స్వయముగా ఏతెంచి మా బావులకి నచ్చజెప్పి వాటన్నిటినీ వెంటబెట్టుకు వెళ్లవచ్చును. వాటితోపాటు మేమున్నూ బయలుదేరి రాగలవారము..”
అలా రాసి పాదుషావారికి పంపారు. ఆ లేఖ చూసి,
“ఏమిటీ! మా దిగుడు బావులు వాళ్ల దేశమేగి వారి బావుల్ని తీసుకు రావాలా! ఇది అసాధ్యం కదా. మనం వారికి పరీక్షపెడుతూ వ్రాసిన ఆహ్వానానికి వారు ఎంత చమత్కారంగా బదులిచ్చారు! భేష్.” అని మనసులో మెచ్చుకుని - ఈసారి రాయలవారికి సవ్యమయిన ఆహ్వానం పంపిస్తూ వారి తెలివితేటల నభినందించాడు. రాయలు ఆ గండం గట్టెక్కించినందుకు రామకృష్ణుడికి బహుమానాలిచ్చాడు.
19) గూని మందు *
మంత్రులు సేనాధిపతులు మొదలయిన ముఖ్యులతో కూర్చుని -శత్రురాజులమీద దండెత్తే విషయంలో రహస్యఆలోచనలు చేస్తున్నారు కృష్ణదేవరాయలు. వారి అనుమతి తీసుకోకుండాఅక్కడికి ప్రవేశించాడు రామలింగడు. వెళ్ళి ఊరుకోకుండా పరిహాసం ఆడబోయాడు. అతిముఖ్యమయిన విషయం మాట్లాడుతూండగా రావడం; వచ్చి పరిహాస ప్రసంగం చేయబోవడం - రాయలకి పట్టలేని కోపం తెప్పించింది.
“సమయమూ సందర్భమూ. లేకుండా .... పిలవని పేరంటానికి వచ్చి....పరిహాస ప్రసంగం చేయబోయిన యితన్ని తీసుకుపోయి గొయ్యితవ్వి కంఠం వరకూ పాతిపెట్టి ఒకరోజుంచి మర్నాడు ఏనుగుతో తొక్కించండి అని భటులనాజ్ఞాపించాడు.
రామకృష్ణుడికి రాయలటువంటి కఠినమయిన శిక్షవిధించడం అక్కడివారందరికీ బాధకలిగించింది, కాని చాలా కోపంగా ఉన్న రాయలవారికీ సమయంలో నచ్చజెప్పి అతన్ని కాపాడడానికెవరికీ సాహసం. చాలక పోయింది.
రాజాజ్జను జవదాటలేక భటులు రామకృష్ణుని ఊరిచివరకు తీసుకుపోయి- గొయ్యి తవ్వి కంఠమువరకూ మట్టికప్పి వెళ్లిపోయారు. ఏనుగుచేత తొక్కించడం మర్నాడు కదా.
రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఈగండంనుంచెలా బయట పడడమా అని బుర్రకి పని కల్పించాడు. కొంతసేపయ్యే సరికి ఒక చాకలి చెరువులో ఉతికిన బట్టలమూటను వీపున పెట్టుకుని ఆ తోవన వస్తూ తల మాత్రమే కనిపిస్తున్న మనిషిని, చూసి మొదట భయపడిపోయాడు. కొంచెంసేపు చూసేసరికి ఆ మెడా దాని మీద తలా రామలింగడిదని గుర్తించాడు.
అప్పుడతనికాశ్చర్యమేసింది. అతని దగ్గరగా వెళ్లి -“అయ్యా!. తమరు తెనాలిరామకృష్ణ కవిగారు కదా? అని అడిగాడు వినయంగా. “ఔను అన్నాడతను నిదానంగా. మనసులో మాత్రం “చిక్కాడు” అని సంతోషిస్తూ.
తమలాంటివారికిలాటి కష్టమెందుకొచ్చిందయ్యా? మిమ్మల్నిలా పాతిఫ్రెట్టిందెవరు? ఎందుకు? ఆరాలు తీశాడు ఆ గూని చాకలి. “నన్నెవరూ పాతిపెట్టలేదు, ఇది వైద్య విధానం.
కొన్నాళ్ళనుండి నాకు 'గూని' వచ్చి సరిగా నడవలేక పోతూంటే వైద్యుడి దగ్గరకెళ్లి చికిత్స అడిగాను. ఆ వైద్యుడు నాసమస్య విని యిలా రెండు మూడు రోజులు చేస్తే ఎంతటి గూనయినా నయమౌతుందన్నాడు. అందుకని నేనే నన్నిలా పాతిపెట్టించుకున్నాను” అన్నాడు నిబ్బరంగా.
ఆ మాటలకి చాకలి మొహం ఆనందంతో ఉబ్బి చాటంతయింది. రామలింగడికి చేతులెత్తి దణ్ణంపెడతూ-“బాబూ! నేను కూడా కొన్నాళ్లనుంచి గూనితో బాధపడుతున్నవాడినే కావాలంటే చూడండి అని తన గూని చూపించి “ఈ గూనివల్ల పనిపొట్లు చేసుకోవడం కష్టంగా ఉంది. పైగా నన్ను నలుగురూ నవ్వుతూ గూనిగూనని వెక్కిరిస్తున్నారు. మీ 'గూని' నయమయితే నేను కూడా యిలా చేస్తాను బాబూ” అన్నాడు.
నాగూని పోయిందో లేదో నన్నుపైకి తియ్యకుండా ఎలా తెలుస్తుంది? ముందు నన్ను బయటకి తియ్యి. నాగూని పోయిందో లేదో చూద్దువుగాని నాగూని పోతే నేను నీకు సహాయం చేస్తాను. అదేమంత భాగ్యం?” అన్నాడు రామలింగడు.
ఆగూనిచాకలి గోతిలోని మట్టిని తీసి పక్కకి పోశాడు. రామలింగడు గోతిలోంచి పైకొచ్చి నిటారుగా నిలబడ్డాడు. అతనినలాచూసిన చాకలి ఆనందానికీ ఆశ్చర్యానికీ అవధుల్లేవు. “భలే! సిత్రంగా ఉందే తమగూని మాయమైపోయింది.
మీరుచేసినట్లే నేనూ చేస్తాను. నాగూని పోతుంది. నేనుగోతిలోనిలబడతాను. తమరు నాకంఠంవరకూ మట్టివేసి గొయ్యి పూద్చండి. ఇలా అడుగుతున్నానని కోపగించుకోకండి,పెద్దలు అంటూ బతిమాలాడు. సరే అని అతన్ని గోతిలోకి దిగమని.... మట్టికప్పి తనదారిన తానుపోయాడు రామలింగడు. ఆ చాకలి అమాయకత్వానికి నవ్వుకున్నాడు.
20) గర్వ భంగం *
శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది.
“పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె గర్వం మరీపెరిగిపోయింది. ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది.
“ఆమె గర్వం అణచాలి పండితుల గౌరవం కాపాడాలి” అని నిశ్చయించుకుని- ఒకనాడు సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డిమోపు పెట్టుకుని - ఆమె యింటిముందు “గడ్డిమోపండీ..గడ్డిమోపు-” అని అరవసాగాడు.
శ్రీవాణి యింట్లో కొన్ని ఆవులుండేవి. అందుచేత ఆమెతరచుగా పచ్చ గడ్డి కొనేది. అది తెలుసుకునే రామలింగడు అలా వేషమేసుకుని అరవసాగాడు. ఆమెకతని కేకలు విని మేడదిగి కిందకొచ్చి "ఏమయ్యా గడ్డిమోపెంతకిస్తావ్?" అని అడిగింది.
తన పాచిక పారుతూందని మనసులో సంతోషపడుతూ “పట్టెడు మెతుకులుపెడితే గడ్డిమోపిస్తాను” అన్నాడతను. అమాయకంగా. బలేమంచి చౌకటేరమూ... మించిన దొరకదూ...” అని ఆనందపడిపోతూ “అలాగే పెడతాను మోపు పెరట్లో వెయ్యి” అంది.
రామకృష్ణుడు మోపునిలోపల వేసి వచ్చి నిలబడ్డాడు. ఆమె పట్టెడన్నం ఆకుతో తెచ్చి అతనికివ్వబోయింది.
రామకృష్ణుడది తీసుకోకుండా-"నేనడిగింది మెతుకుకాని అన్నం కాదు నీకు తెలిసిన పాండిత్యమింతేనా? ఈపాటిదానికేనా నీకంటే గొప్ప పండితులు లేరని గర్వంతో విర్రవీగిపోతున్నావు?,
పట్టెడు మెతుకుకీ పట్టెడన్నానకీ తేడా తెలుసుకోలేని నీపాండిత్యమేం పాండిత్యం? ఇప్పుడు నీ ఓటమి నంగీకరిస్తావా? అని అడిగాడు. అతను రామకృష్ణకవి అని ఆమె గ్రహించి, సిగ్గుపడుతూ తన ఓటమినంగీకరించింది.
ప్రకటించిన ప్రకారం అతనికి వెయ్యివరహాలూ యిచ్చేసింది. ఈ విషయం విని - శ్రీవాణికి గర్వభంగం చేసినందుకు రాయలవారితో సహ పండితలోకం పరమానందపడింది.
21) కారెవరూ కవితకనర్హులు *
శ్రీకృష్ణదేవరాయలవారు నివసించే రాజభవనానికి తిమ్మన అనే కావలివాడుండేవాడు. అతను చాల ధైర్యసాహసాలు కలవాడు తిమ్మన సేవలను మెచ్చుకుంటూ రాయలవారతనికొకనాడు, అందమయిన -ఖరీదయిన శాలువని బహుకరించారు.
తిమ్మనకి కవులన్నా కవిత్వమన్నా ఎంతో గౌరవం. బహుమతిగా పొందిన శాలువను భుజంమీద కప్పుకుని అతను వస్తూంటే, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, తెనాలి రామకృష్ణుడు కలిసివస్తూ ఎదురయ్యారు.
అతను బహుమతి పొందినందుకు తమసంతోషాన్ని చెప్పడానికి వారు నలుగురూ ఒక్కొక్క పాదం చొప్పున దిగువ విధంగా కందపద్యం చెప్పారు.
పెద్దన - “వాకిల కావలి తిమ్మా”
ముక్కుతిమ్మన - “ప్రాకటముగ సుకవి వరుల పాలిటి సొమ్మా”
భట్టుమూర్తి - “నీకిదే పద్దెము కొమ్మా”
(మరి రామకృష్ణుడు ఏంచెప్పినా అతని ప్రత్యేకత కనిపిస్తూంది కదా!) రామకృష్ణుడు - “నాకీ పచ్చడమేచాలు నయముగ నిమ్మా” అని పద్యాన్ని పూర్తి చేశాడు. తిమ్మన తనపై చెప్పబడిన ఆ పద్యాన్ని విని సంతోషించి తన భుజం మీదున్న శాలువను రామకృష్ణునికి బహూకరించాడు. మిగిలిన వారికి కూడా తగిన బహుమతులను యిచ్చాడు.
22) రామలింగడి గుర్రం పెంపకం *
రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు.
రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు.
అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి.
రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకెళ్లి చూపిస్తున్నారు. రామలింగడు తన గుర్రాన్ని చూపించవలసీన తరుణం వచ్చేసింది.
గుర్రంలేకుండా వచ్చిన రామకృష్ణుణ్ని - “మీరు పెంచుతున్న గుర్రమేదీ ? అని రాయలవారడిగారు. అప్పుడు రామకృష్ణుడు - “మహారాజా! దానినిక్కడికి తీసుకొచ్చి చూపించే శక్తి నాకులేదు.
అది ఎంత పెంకి గుర్రమో నేను చెప్పలేను. ప్రతిరోజూ నేను పెట్టే గడ్డి తింటూకూడా అదినన్ను దగ్గరకు రానివ్వడంలేదు. అంచేత అశ్వదళంలో ఉండు వారినెవరినయినా పంపి దాన్నిక్కడికి తెప్పించే ప్రయత్నంచెయ్యండి.”- అని అతివినయంగా ప్రార్థించాడు.
మీ గుర్రం అంత బలంగా తయారయిందా? బలంగా ఉండే గుర్రానికి పొగరుండడం సహజమే.” అంటూ అశ్వశిక్షకుడినొకని పిలిపించి 'రామకృష్ణకవిగారింటికి వెళ్ళి వీరు పెంచుతున్న గుర్రాన్నిక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆ అశ్వశిక్షకుడు - మహమ్మదీయుడు. బలమయినవాడు. అతనికి పొడయిన గడ్డం ఉంది. అతను, రామకృష్ణుడితో అతనింటికి వెళ్లి “ గుర్రం ఎక్కడుందో చూపించండి ” అని, అడిగాడు.
“అదుగో, ఆ గదిలో ఉంది. దాన్ని పట్టి ఆపడం నావశం కాక ఆ గదిలో ఉంచి ... కన్నంలోంచి ఆహారం, నీళ్లూపెడుతున్నాను రోజూ ఈ కన్నంలోంచి చూడు” అన్నాడు. “మీగుర్రం అంతపెంకిదా? చూస్తాను”అంటూ అతనా కన్నంలో తలదూర్చి చూశాడు. అది ప్రతిరోజూ రామలింగడు గుర్రానికి గడ్డిపరకలందించే సమయం. అందుచేత గుర్రం గడ్డికోసం కన్నందగ్గరే కాచుకుని ఉంది. మవోామ్మదీయుడి పొడవయిన గెడ్డాన్ని చూసిచూడడంతోనే గడ్డిపరకలనుకుని గడ్డాన్ని నోటితో అందుకుని తినబోయింది.
గుర్రం అలా తన గెడ్డాన్ని లాగేస్తూంటే గెడ్డాన్ని కాపాడుకోలేకా, బాధభరించలేకా “అరె! అల్లా! అల్లా! ఇదెంత పొగరుమోతు గుర్రం! నా గెడ్డం లాగేస్తూంది. నాతలని మొండెంనుంచి లాగేసేటట్లుందీ భడవ. రక్షించండి, రక్షించండి!- అంటూ అరుస్తూ ఏడవసాగాడు. అశ్వశిక్షకుడు, అతనెంత ఏడ్చినా వదలకుండా గుర్రం అతని గడ్డాన్ని పట్టి పీకెయ్యసాగింది. ఆవెంట్రుకలనే తినెయ్యసాగింది. ఆకలికి తాళలేక.
అతని వెంటవచ్చిన వారు ఆ దృశ్యం చూసి భయపడీ జాలిపడీ పరుగుపరుగున వెళ్ళి రాయలవారికి విన్నవించారు. వెంటనే అంగరక్షకులని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు రాయలవారు. గుర్రం నోటిలో చిక్కిన తనగద్డాన్ని విడిపించుకోలేక విలవిలలాడుతున్న అతన్ని చూసి జాలిపడి- ఆమహ్మదీయుడి గెడ్డాన్ని కత్తెరతోకత్తిరింపజేసి అతన్ని విడిపించారు. అతని బాధ కొంత తగ్గింది.
తరువాత ఆ గది తలుపులు తెరిపించి చీకటిలోనూ చిన్నగదిలోనూ చిక్కిశల్యమై ఉన్న గుర్రాన్ని చూసి బాధపడి రామకృష్ణుని మీద చాలా కోపం చెందారు.
“ఖరీదయిన గుర్రానికి కడువునిండా తిండి పెట్టకుండా మాడద్చిచంపడమూ, మాకు నష్టం కలిగించడమూ నేరమని మీకు తెలియదా? మావద్ద నెలనెలా తీసుకున్న సొమ్మునేంచేశారు? కడుపునిండా చాలినంత గడ్డయినా పెట్టొద్దా? ఈ గుర్రమింత హీన స్థితిలో ఉండడానికి కారణమేమిటి? తగిన సంజాయిషీ యివ్వండి”-గద్దించారు రాయలువారు.
రామకృష్ణుడు వినయంగా చేతులుకట్టుకుని ప్రభూ! తమరు కళ్లారా చూస్తూ అడిగితే నేనేం చెప్పగలను? ఒక్కవిషయం ఆలోచించండి. ఈగుర్రానికి తిండిపెట్టకుండా ఎండగడితేనే యింత పొగరుగా శిక్షకుడిని కూడా గెడ్డం పీకేసిందే, కడుపునిండా తిండిపెడితే యింకెంత పొగరుగా తయారౌతుందో? అప్పుడు దీన్ని పట్టడం ఎవరిశక్యమైనా అవుతుందా?” అని అడిగాడు.
అతని యుక్తికి రాయలవారు మనసులో నవ్వుకుని - చావడానికి సిద్ధంగా ఉన్న ఆ గుర్రాన్ని అశ్వశాలకి పంపించి- ఆ గుర్రంవల్ల నానాబాధ పడిన అశ్వశిక్షకుడికి కొంత సొమ్ము పరిహారంగా యిచ్చాడు. రామకృష్ణుడికి తెలివికిది మరో మచ్చుతునక.
23) రాయలవారి వరం *
ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని - అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు,
అది - కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని తన సేనానాయకుడు పసరము గోవిందరాజని పిలిపించి- “రాయలను పట్టి బంధించి తే” అంటూ చాలా సైన్యాన్నిచ్చి పంపాడు. రాయలవారిసైన్యం చాలా తక్కువ.
అయినా కొంతసేపు శత్రుసైనికులతో పోరాడి చివరకు వెనక్కితగ్గారు, కాని కృష్ణదేవరాయలొక్కడే వందలాదిగా శత్రుసైనికులు చుట్టుముడుతున్నా నిర్భయంగా వారితో పోరాడసాగాడు.
అతని పరాక్రమధాటికాగలేక శత్రుసైనికులు చెల్లాచెదరైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు.
ఐతే ఆ యుద్ధంలో రాయలవారు జయం పొందడం అసాధ్యమని ఆయనవెంట వెళ్లిన వండితులు భావించారు... తమరాజునెలా కాపాడుకోవడమా అని వాళ్లాలోచించసాగారు. యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. అప్పుడు రామకృష్ణకవి పసరము గోవిందరాజుకి వినపడేలా యీ పద్యం చదివాడు.
“ బసవనకు పుట్టినప్పుడే
పసరము గోవిందరాజు పసరంబయనన్
కసవేటికి తినడనగా
కసవొందెను శత్రులాజి గదసిన వేళన్
(భావం: పశువుకి పుట్టిన పసరము గోవిందరాజు పశువయినా గడ్జెందుకు తినడం లేదంటే-అతను యుద్దంలో శత్రువుల చేతిలో మరణించాడు కనుక.) ఇది. తిట్టుకవిత్వం-శాపం కూడా రామకృష్ణుని వాక్కు అమోఘమయినది
(వ్యర్ధం కానిది) అందుచేత ఆపద్యం వింటూనే గోవిందరాజు రక్తం కక్కుకుంటూ కిందపడి మరణించాడు. అతని సైనికులు పారిపోయారు.
పెద్దన మొదలయిన కవులు రామకృష్ణకవీ! మీశక్తి సామర్భాలనింతవరకూ. తెలుసుకోలేకపోయాను. అనుకోకుండా సంభవించిన పెద్ద విపత్తునుండి నన్ను మీరు రక్షించారు.
నాగౌరవ ప్రతిష్టలు నిలబెట్టారు. మీకు నాకృతజ్ఞతలు. మీకేం వరంకావాలో కోరుకోండి ఇస్తాను-” అన్నాడు. అప్పుడు - “మహాప్రభూ! కవులమయిన మేము మీ ప్రజలమే మా రాజయిన మిమ్మల్ని కాపాడుకోడం మా బాధ్యత మీ అనుగ్రహముంటే అంతేచాలు” అన్నాడు రామకృష్ణుడు వినయంగా.
మీరు నన్ను రక్షించారు. అందువలన మీకేదయినా మేలుచేయాలని, నేను దృఢంగా సంకల్పించుకున్నాను. కనక మీకు కావలసినవి కోరుకోండి.” అన్నారు రాయలు.
రామకృష్ణుడు చేతులు జోడించి “మహారాజా! మీదయవలన నేనూ నాకుటుంబమూ ఎంతో సుఖంగా ఉంటున్నాం. ఐతే నేనప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాను అవి మీకు తప్పు పనులుగా తోచవచ్చును.
కనుక నేను రోజుకి నూరు తప్పులు చేసినా తమరు నన్ను దండించక క్షమించాలి. ఈవరమొక్కటి చాలు నాకు” అని ప్రార్థించాడు. రాయలు మందహాసంతో- “కవీంద్రా! మీరుకోరినట్లే రోజుకి నూరు తప్పులు చేసినా మిమ్మల్ని దండించను.
తప్పకుండా క్షమిస్తాను” అని వాగ్దానం చేశారు. అప్పుడందరూ తమ రాజధానికి ప్రయాణం కట్టారు.
24) మతం సమ్మతం కాదు *
తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు.
రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు.
నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే.
తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు-
“రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభావముందని ప్రజలు గ్రహించి వారిని దూషిస్తునట్లు తెలిసింది వారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కొందరు అధికారులు కూడా నాకు మనవి చేశారు. ఆయన మా కులగురువు కనుక నేనేమనడానికీ వీలుండదు. కాబట్టి ఆయన ఛాందసబుద్ధిని పోగొట్టడానికి మీరే ఏదైనా ఉపాయం చూడండి” అలాటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న రామకృష్ణుడు “తమ ఆజ్ఞ ప్రకారమే తాతాచార్యులవారి ప్రవర్తనలో మంచిమార్చుతేవడానికి ప్రయత్నిస్తాను” అని రాయలవారికి చెప్పి వెళ్ళాడు.
రాయల మాటలతనికి కొండంత బలమిచ్చాయి. మర్నాడే అతను తాతాచార్యుల ఇంటికి వెళ్లాడు అతన్ని చూస్తూనే అయన తన ఉత్తరీయంతో ముఖం కప్పేసుకున్నారు.
“గురుదేవా! నేను తమ శిష్యవర్గంలోని వాడినే కదా? నన్ను చూచి ఉత్తరీయంతో ముఖం కప్పేసుకున్నార్రేం?” అమాయకంగా అడిగాడు రామలింగడు. “రామకృష్ణా! నువ్వు నాకు ప్రియశిష్యుడివి 'కనుక రహస్యం చెబుతున్నాను విను. స్మార్తమతము మహా పాపభూయిష్టమయినది.
స్మార్తుని చూసినవారు మరు జన్మలో గాడిదలుగా పుడతారు. అందుకు నేను స్మార్తుదెదురైతే ముఖానికి ఉత్తరీయం కప్పుకుంటాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు” అన్నారాయన.
రామకృష్ణుడు ఆచార్యుల వారివద్దశలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పదిరోజులుగడిచాక ఒకరోజు రాయలవారు కవులు పండితులు మంత్రులు మొదలయిన వారితో ఊరిబయటనున్న ఉద్యానవనానికి వెళ్లారు.
కొంతసేపక్కడ గడిపివస్తూండగా తోవలో వారికి ఒక గాడిదల గుంపు ఎదురయింది. ఆ గాడిదల గుంపుని చూసీ చూడడంతోనే రామలింగడు పరుగు పరుగున పోయి వాటికి సాష్టాంగ నమస్కారాలు చేయసాగాడు. అతని చేష్టలకి రాయలవారితో సహా అందరూ పకపక నవ్వారు. రాయలవారు “ రామకృష్ణకవీ! మీకు మతికాని చెడిందా? గాడిదలకి నమస్కరిస్తున్నారేమిటి?” అని అడిగారు.
అదివిన్న రామకృష్ణుడొకసారి తాతాచార్యులవారివైపు చూసి అంతలోనే రాయలవేపు తిరిగి “రాజేంద్రా! నామతి చెడలేదు ఈ గాడిద మన తాతాచార్యులగారి తాత. ఇది వారి బావమరిది. ఆపక్క నున్నది తాతాచార్యులవారి మేనమామ. ముఖంమీద నల్లమచ్చుందే ఆ గాడిద మన ఆచార్యులవారి తండ్రి.
పూర్వజన్మలో వీళ్ళు స్మార్తుల ముఖంచూడడంవలన యీజన్మయందిలా గాడిదలై పుట్టారు. మహానుభావులను దర్శించుట వల్ల నా జన్మపావనమయింది. నాపాపం పటాపంచలయింది. నామాటలబడ్దాలనుకోకండి “ఒకసారాగి తాతాచార్యుల వైపు చూసి “వచ్చే జన్మలో తమకిలాటి దుస్థితి సంభవించకుండా ఉండేందుకే పూజనీయులయిన మన తాతాచార్యులవారు స్మార్తులు కనబడితే గాడిద జన్మకలుగుతుందని ముఖానికి ఉత్తరీయం కప్పకుంటున్నారు. కావాలంటే యీ, విషయం వారినడిగి తెలుసుకోవచ్చు- అన్నాడు.
ఆమాటలకు తాతాచార్యులవారు సిగ్గుతో తలవంచుకున్నారు. ఆనాటినుంచీ ఆయన ముఖాన్ని ఉత్తరీయంతో కప్పుకునే అలవాటుకి స్వస్తి చెప్పారు. రామకృష్ణుడి చమత్మారానికి అందరూ ఆనందించారు. రాయలవారు. రామకృష్ణుడికి రహస్యంగా బహుమతులందించారు.
very good and nice
ReplyDelete