పరమానందయ్య శిష్యుల కథలు, Paramanandayya Sishyulu Stories In Telugu

Paramanandayya Sishyula Kathalu in Telugu | పరమానందయ్య శిష్యుల కథలు

One of the long-running series of stories in Telugu, "Paramanandayya Shishyula Kathalu" is an Entertaining story. The main point of these stories is the lack of intelligence

Because this ignorance contributes to the creation of great humor, We have brought you 18 "Paramanandayya Sishyulu" stories

తెలుగులో  చిరకాలంగా ప్రచారంలో ఉన్న కథల మాలికలలో ఒకటి “పరమానందయ్య శిష్యుల కథలు” వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధానాంశం అతితెలివి తక్కువతనం అంతా శిష్యుల రూపంలో ఒకేచోట ప్రోగుకావడం!

ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహద పడటం వల్లనే, ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే 'వీడు పరమానందయ్య శిష్యుడిలా ఉన్నాడురా' అనడం మనకు అనుభవంలో ఉన్నదే!

పరమానందయ్య శిష్యుల కథలు • Paramanandayya Sishyulu Stories In Telugu

1) శిష్యులతో సహ పరమానందయ్య ఏరుదాటడం

తన అసమాన ప్రజ్ఞాశాలురైన పదిమంది శిష్యులతో, చుట్టు ప్రక్కలగ్రామాలకు వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకొనే నిమిత్తం ఓ శుభ ముహూర్తాన తెల్లవారుజామునే బయల్దేరారు పరమానందయ్య,

ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం, బియ్యం, వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠంవైపు ప్రయాణం సాగించారు.

“ఏటివరకూ అయ్యవారినీ, వారి శిష్యుల్నీ దిగవిదిచి రమ్మని” ఓ పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటిఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురుశిష్యులకు. అక్కడ్నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు.

“తాము వెళ్ళేటప్పుడు పాదాల్లోతు నీళ్ళున్న ఏటికి, ఇంతలోనే ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయబ్బా?” అనే సందేహం పట్టుకుంది శిష్యులకు. ఏట్లోకి ఎప్పుడైనా నీళ్ళు రావచ్చుననే జ్ఞానం వారికీ వారి గురువైన పరమానందయ్యకీ కూడాలేదు.

“ఇంత సామానుతో వస్తుంటే, ఈర్ష్యకొద్ద్మీ మా ప్రయాణానికి అడ్డు పడాలనే ఏరు పొంగిపొర్లి ప్రవహిస్తోంది” అని గురు శిష్యులేకమై తీర్మానించేశారు.

“సరే! ఇక చెయ్యడానికేముంది? ఏరు ఎంతసేపు మేలుకొని ఉంటుంది? ఏదో సమయాన దానిక్కూడా నిద్ర ముంచుకొస్తుందిగా? ఆ సమయం చూసి చకచకా ఏరు దాటేస్టే సరి!” అని ఒక శిష్యుడన్నాడు.

“పొగరుబోతు ఏరు గురువుగారూ! దీన్నిలా వదిలెయ్యకూడదు. మీదేమో జాలిగుండె. కరవ వచ్చిన పామునైనా పోన్లే పాపం! అంటారు. మా తాత మాత్రం పొగరుబోతుల్ని శిక్షించాల్సిందే అనేవాడు” అంటూనే ఒక కాగడా వెలిగించాడు.

“పట్టపగలు ఇంకా చీకటైనా పడకుండానే కాగడా దేనికిరా ?” అని అడిగాడు ఒక శిష్యుడు.

"ఏరును భయపెట్టటానికి కాగడా వెలిగించాడు శిష్యుడు"

“ఓరి. సన్నాసీ! మనవాడు జాగ్రత్తపరుడు. ఇప్పుడంటే సాయంకాలం. ఇంకాస్సేపటికి చీకటి పడదా? అప్పుడు చీకటిలో ఏం తడుముకోవడం అని ముందుజాగ్రత్త చర్యగా వెలిగించాడన్న మాట!”- గురువుగారు సమర్ధించారు.

“అది కాదండీ గురువుగారూ! నేనిప్పుడు ఈ కాగడాతో ఆ పొగరు ఏరుకు చురక పెడతా! బుద్దొచ్చి దారి వదుల్తుంది” అంటూ కాగడా తీసుకొని ఏటిలోకి రెండడుగులు వేసి, అది నీట్లో ముంచాడు. 'చుయ్‌'మని పెద్ద శబ్దం చేస్తూ, అది ఆరిపోయేసరికి “ఓసి నీ సిగ్గోయ్యా! ఇంకా బుస్సుమంటూ అరుస్తావేం” అంటూ గుండలరచేత పట్టుకుని అందరూ ఉన్నచోట కొచ్చిపడ్డారు.

“ఏమయిందిరా?” అని అడిగాడొక శిష్యుడు.

“దానికి బాగా పొగరు బలిసింది. వాతలకు లొంగేలా లేదు. చురకేస్తే కరవ్వొస్తోంది. ఇహ లాభంలేదు” అన్నాడు కాగడాతో వెళ్ళిన శిష్యుడు.

“చూశార్రా! నేను ముందే చెప్పలా? ఏరు నిద్రపోయే దాకా వేచి ఉండటమే మనకు ఇప్పుడున్న దారి” మళ్ళీ మొదటి శిష్యుడు అందుకున్నాడు.

ఇంతలో ఆ రేవు దగ్గరికి వచ్చిన ఓ జాలరి వీళ్ళతీరు చూసి, మరింతగా ఉడికించాలని “అయ్‌వోర్లూ! నిజమేనండి! ఈ ఏరు మహా దొంగది. దీన్నస్సలు నమ్మకూడదు” అన్నాడు. 

“ఏం నాయనా? నీకూ టోకరా ఇచ్చిందా? నీ వలగానీ, చేపల బుట్టగానీ కాజేసిందా ఏమిటీ?” అని అడిగారు పరమానందయ్య ఆసక్తిగా.

“చేపలూ, అవీ దానికెందుకండీ? వీటిలోన అవే ఉంటాయి. నాగ్గాదు గానీ, మా తాతకిది గొప్ప మోసం చేసిందండి! ఆయనేమో ఉప్పు అమ్మేవాడు. ఓసారి ఈ ఏరే ఇలాగే అడ్డంపడి పొంగి పొర్లుతూ ప్రవహించే సరికి, ఆ ధాటికి ఆగలేక నట్టనడి ఏట్లో బండి బోల్తా పడింది. మా తాత అతికష్టంమీద బండిని ఏటి అవతలకి దాటించి బస్తాల్లోకి చూద్దుడు గదా! ఒక్క ఉప్పురవ్వ ఉంటే ఒట్టు. మొత్తం పదిబస్తాల ఉప్పు కాజేసింది. ఆ నష్టానికి ఆయన ఆర్నెల్లు మంచమెక్కాడు కూడా” జాలరి చిత్రంగా చేతులు తిప్పుతూ అన్నాడు.

“ఉప్పునే మాయం చేసిందంటే బాబోయ్‌! ఇన్ని సరుకున్నాయి. ముఖ్యంగా తామందరికీ ఇష్టమైన బెల్లం ఉంది. అదిగాని కాజేస్తే, చాలాకష్టం!” అనుకున్న పరమానందయ్య అందర్నీ ఏరు నిద్రపోయే వరకూ కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించాడు.

2) క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు

ఇంతలో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి గొప్ప సందేహం కలిగింది.'రాత్రిపూట ఆరుబయట ఏటిఒడ్డున దయ్యాలు షికారు చేస్తుంటాయి” అని ఏదో సందర్భంలో గురువుగారు, చెప్పిన వైనం ఆ శిష్యుడికి గుర్తుకొచ్చింది.

ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏరుగానీ నిద్రపోకపోతే, అర్ధరాత్రి అయినా సరే! తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది కదా! చూడబోతే గురువుగారు అందర్నీ కూర్చోవలసిందిగా చెప్పారు. ఇంకాస్సేపట్లో దయ్యాలు షికారు కొచ్చాయంటే, అవి మనల్ని పీక్కుతినక బతకనిస్తాయా?.. ఇదీ ఆ శిష్యుడి శంక.

భయపడుతూనే తన అనుమానం బయట పెట్టాడా శిష్యుడు. దానికి పరమానందయ్యగారు వెంటనే స్పందించి “నిజమేనర్రోయ్‌! సమయానికి గుర్తు చేశాడు కుర్రకుంక. అదీ బుద్ధి అంటే.... పాదరసంలా అలా పని చెయ్యాలి. వెంటనే బిగ్గరగా అందరూ ఆంజనేయ దండకం లఘువుగానేనా పఠించండి” అంటూనే ముందు తాను ప్రారంభించాడు.

“శ్రీ ఆంజనేయం- ప్రసన్నాంజనేయం” అని పరమానందయ్య అనగానే “ప్రభాదివ్యకాయం” అని ఒకడూ, “ప్రకీర్తి ప్రదాయం” అని ఇంకో శిష్యుడూ, “భజే వాయుపుత్రం” అని మరో శిష్యుడూ, “భజేవాలగాత్రం” అంటూ చివరివాడూ అందుకున్నారు.

“అలాక్కాదర్రా! అందరూ మొదట్నుంచీ పూర్తిగా మొత్తం చదవాలి” అనగానే, ఒక్కడికీ గుర్తులేదు కనుక “గురువుగారూ! మంత్రాల్ని నోట్లోనే చదువుకోవాలి. బైటకు అనరాదు” అని మీరేకదా ఓసారి చెప్పారు” అంటూ ఇంకో బుద్ధిమంతుడు గుర్తు చేశాడు.

“అవునవును! చెప్పే వుంటాను. -అసలే దెయ్యాలకి విరుగుడు మంత్రం-ఆంజనేయస్తోత్రం. మనం విరుగుడు మంత్రాలు చదువు తున్నట్లు వాటికి అస్సలు తెలీకూడదు” అన్నారు పరమానందయ్య సమర్దించుకుంటూ.

“ఎంతరాత్రిఅయినా ఏరు నిద్రపోయిందో, లేదో తెలీయడమెలా?” అంటే “ఏముందీ! ఇందాక మనవాడు కొరకంచుతో చురక పెట్టాడు గదా! దాన్ని తిరగేసి నీట్లోకి గుచ్చితే సరి.... నిప్రోతే, అదే పక్కకు ఒత్తిగిల్లుతుంది” అని పరిష్కారం సూచించారు పరమానందయ్యగారు.

“ఇంకా వేచిచూస్తూ కూర్చోడం నావల్ల కాదు. ఆపనేదో నేనుచేస్తా! ఏరు నిద్దరోయిందో లేదో చూసొస్తా” అంటూ ఆంజనేయ దండకం గుర్తున్నంత మేర చదువుకుంటూ, ఇందాకటి శిష్యుడే కొరకంచు తిరగేసి పట్టుకొని ధైర్యంగా ఏట్లోకి వెళ్ళి గుచ్చాడు.

నీటి ప్రవాహ వేగానికి కొరకంచు ఊగిసలాడింది. గుచ్చినచోట నీళ్ళు సుడి తిరిగేసరికి, అది ప్రక్కకు ఒత్తిగిలి మరీ నిద్రోయిందని గుర్తించి సంబరంగా ఆ శిష్యుడు అక్కడ్నించే అందర్నీ సామాన్లతో సహా రమ్మని కేక వేశాడు. అందరూ పంచెలు పైకి ఎగగట్టి, సామాగ్రి బుర్రలమీద సర్దుకొని ఏట్లో కాలు మోపారు.

ముందుగా నెమ్మదిగా పరమానందయ్య; వారికి కాస్త వెనుకగా ధైర్యశాలి శిష్యుడూ, ఆ వెనుక ఒకరొకరే మిగతావారూ ఏట్లో దిగి అతి జాగ్రత్తగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. మహాసముద్రాన్ని దాటినంతగా ఆనందపడ్డారు.

3) శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం

ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు.

“ఆరే నిజంగానా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య.

“నిజమేనండీ గురువుగారూ! మేం మీ శిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి... 'ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం” అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి” అన్నాడు ఆ శిష్యుడు.

ఆ శిష్యుడు ఎంతో చురకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకించడానికేముంటుంది?

అయిన్సా, శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి “మనం ఏకాదశరుద్రుల్లాంటి వారం” అంటూ తనను మినహాయించుకొని లెక్కబెట్టాడాయన కూడా. పదిమందే లెక్క తేల్తున్నారు. దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకర్ని మింగేసిందని భోరుమన్నాడు.

"లెక్కతప్పు వేసుకొంటూ భోరుమంటున్న శిష్యులు"

ఇక్కడ గురుశిష్యులిద్దరూ చేస్తున్న పొరపాటేమిటీ అంటే... ముందుగా తమను తాము లెక్కించుకొని, ఇతరుల్ని లెక్కించుకుంటూ రావాలన్న కసీసజ్ఞానం విస్మరించడం. అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువ వస్తున్నారు.

తీరా, వికల మనస్కులై ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా, ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువు గారితో పాటు అందర్నీ వరసగా నిలబెట్టి, ఒక్కక్కరినే చేత్తోతట్టి లెక్కబెట్టే సరికి 11మందీ లెక్కతేలే సరికి అంతా స్థిమిత పడ్డారు.

4) కార్తీక సోమవార వ్రతథలం

అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీకమాసంలో, ఉసిరిచెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్యగారు అనడంతో, పమీపంలో ఉన్న అడవిలోనికెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చెయ్యసాగారు.

వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి. గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం భాద్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు, ఇతర పిండి వంటలు చేయసాగారు.

దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యిమీద బియ్యం పెట్టి తాళంవేస్తూ కూనిరాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకు పట్టిన శబ్ధం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి “ఆహా! మన రాగానికి తగ్గ తాళం కుండకే కుదిరింది. ఘటవాయిద్యం బహాుశ్రేష్టమంటారు” అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త ఫణితులు (సంగతులు) వేయసాగాడు.

అన్నం ఉడికే శబ్దం క్రమంగా పల్చ్బబడేసరికి “దీన్తస్సాదియ్యా!

నేనింత ఉత్సాహంగా సంగతుల మీద సంగతులు దంచేస్తుంటే, ఇది తాళం తప్పుతోందే” అని ఆవేశంగా పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెనొకటి తీసుకొని కుండమీద ఒక్కదెబ్బ వేశాడు. అంతే! ఇంకేముందీ? మరి కాస్సేపట్లో సిద్ధం కానున్న అన్నం నేలపాలై, పొయ్యికూడా ఆరిపోయింది.

“గుడగుడ శబ్దం-కుండకు నష్టం” అని పాడుకుంటూ వంట ప్రయత్నం విరమించి రాగాలు తీస్తూ కూర్చున్నాడు దేవభూతి.

ఆ పక్కనే కూరగాయలు తరుగుతున్న ఇద్దరు శిష్యుల్లో ఒకడు వంకాయలు అందుకుని, “వంకాయ వాతం” అంటూ ఆ బుట్టెడు వంకాయలూ చెరువులో పోసి వచ్చాడు. ఇంకో శిష్యుడు అటుగా వచ్చి “సోరకాయ శ్లేష్మం” అంటూ పది సారకాయల్ని పది దిక్కులా విసిరేశాడు.

మరో ఉద్దండుడు “అతి తెలివి సోదరులారా! మీలో ఒక్కరికీ స్ఫురించలేదు. సర్వరోగ నివారిణి, ఈ అడవిలో విస్తారంగా లభించేది కరక్కాయ. అది కూర వండండి” అని సెలవిచ్చాడు. అందరూ కరక్కాయల వేటలో పడ్డారు.

అన్ని అనుష్టానాలూ_ ముగించుకొని, బారెడు పొద్దెక్కి మిట్టమధ్యాహ్నం కూడా అయ్యాక గురువుగారూ, గురుపత్నీ నిదానంగా తమ శిష్యులు వండి వార్చే పంచభక్ష పరమాన్నాలను ఆరగిద్దామని నిజంగానే ఆత్రపడి వనభోజన ప్రదేశానికి చేరుకోగా ఏముందక్కడ? ఆరిపోయిన పొయ్యిలో సగం ఉడికీ ఉడకని అన్నం కుండపెంకుల మధ్య పరుచుకొని ఉండడం తప్ప.

కూరల జాడ ఎక్కడా లేదు. పిండివంటల ఆచూకీ అస్సలు లేదు. శిష్యులంతా ఒక్కో అవస్థలో చెట్టుమీద ఒకడూ, చెట్టుక్రింద ఒకడూ, కొమ్మల్లో ఊగుతూ ఒక్కడూ.... .

“ఏమిటర్రా ఇదంతా?” అని అడిగితే “కరక్కాయల కోత" గురువుగారూ! కనీసం ఐదారు వీశెల కరక్కాయలైనా లేనిదే కూర సరిపోడు కదా! ఇప్పటికి రెండు వీశెల కరక్కాయలు పోగుచేయగలిగాం. ఎంత రాత్రికైనా కరక్కాయలు ఐదు వీశెలూ పూర్తిచేసి, చిటికెలో కూర వండి వార్చెయ్యమూ?” అంటూ అంతా ముక్త కంఠంతో ఒకటే జవాబు.

“కరక్కాయల కూర?” అంటూ ఆశ్చర్యపోయిన గురుపత్నికి “మీకు తెలీదమ్మగారూ! అన్నిరోగాలనూ కుదిర్చే గుణం కరక్కాయకు ఉందని గురువు గారెప్పుడూ అంటుంటారు కదా! కావాలంటే అడగండి” అని ఆ ప్రతిపాదన తెచ్చిన శిష్యుని సంజాయిషీ.

“వీళ్ళని నమ్ముకుని విందు భోజనానికి వస్తే, అర్ధరాత్రయినా పస్తే” అని గ్రహించుకున్న పేరిందేవి “ఓరి తెలివి తక్కువ సన్నాసుల్లారా! మీ నిర్వాకాన్ని నమ్ముకోవడం నాదే తప్పు! ఉదయాన్నే నేనైనా వచ్చి మడిగట్టుకున్నాను కాదు”,అని అప్పటికప్పుడు ఆవిడ నడుం కట్టుకొని చంద్రోదయవేళకు అంతా సిద్ధం చేసేసరికి, ఆ సాయంత్రం కార్తీక సోమవారం ఫలం దక్కేలా ఎట్టకేలకు వనభోజనం ముగించగలిగారందరూ.

Paramanandayya Sishyulu Funny Stories in Telugu

5) గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం

గురువుగారు తరచు గ్రామాలకు తిరుగుతూ, తన కుటుంబానికీ, తన కుటుంబసభ్యులుగా మెలుగుతున్న శిష్యబృందానికీ సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానిక్కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులూ-వంకలూ పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదార్లన్నీ చిత్తడినేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే! అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్యగారీ సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు.

పొరుగున ఉన్న కమలాపురాన్నుంచి ఓరోజు సాయంత్రం శిష్యులతో కలసి కనుఛీకటి పడేవేళ ఇంటికి తిరిగొస్తుండగా ఆయన కాల్లో ముల్లు విరిగింది.

గురువుగారు అక్కడే చతికిలబడి “అబ్బా!... దీని సిగ్గొయ్య! ఈ ముల్లు ఇప్పుడే దిగాలా? ఓ పక్కపొద్దుపోతోంది. ఇంటికి చేరేవరకైనా ఆగొద్దా?” అంటూ ఆపసోపాలూ పడసాగారు.

“అయితే గురువుగారూ! ఇంటికి చేరేవరకూ ఆగితే ముల్లు దిగినా ఫర్వాలేదంటారా?” అని 'ప్రశ్నించాడో శిష్యుడు.

“ఉష్‌! గురువుగారొక పక్క కాల్లో ముల్లుదిగి బాధపడుతుంటే, ఆయన్ని ఇప్పుడే సందేహాలడిగి చంపుతావా చవటా! ముందు ముల్లు తీసే మార్గం చూడవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది” అని గురువుగారి ప్రియ శిష్యుడు దేవభూతి అతడ్ని మందలించాడు.

పరమానందయ్యగారు. అలా చెప్పిన శిష్యుడివైపు ప్రశంసగా చూసేసరికి ప్రతి శిష్యుడూ గురువుగారి మెప్పు పొందాలని నేను ముల్లు తీస్తానంటే నేను ముల్లు తీస్తా... అంటూ వాదులాడుకో సాగారు. 

సూదికోసం దుకాణానికి వెళ్ళారు. కోమటి సూదిని ఇచ్చాడు. ఏది చేసినా అంతా ఐకమత్యంగా చెయ్యాలని కదా గురువుగారు చెప్పారు. కనుక సూదిని అందరం కలహించు కోకుండా, కలసి పట్టుకు వెళ్ళాలి.

ఎలా? అంటే ఎలా? అని తలా ఓ ఉపాయం ఆలోచించారు. అందరిలోనికీ దివ్యభూతి ఉపాయమే బాగా ఉన్నదనిపించింది. దాని ప్రకారం దగ్గర్లో ఉన్న కర్రల దుకాణానికి వెళ్ళగా, అతడు పరమానందయ్య శిష్యులను గుర్తుపట్టి “అయ్యలూ! ఏం కావాలి?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు. తీరా విషయం విన్నాక వాళ్ళ అతి తెలివి తేటలకి నిర్దాంతపోయి గురువుగారి పట్ల గౌరవం కొద్దీ, అంతగా విలువ చెయ్యని తాటి దూలాన్ని ఒకదాన్ని తీసుకుపొమ్మన్నాడు.

అత్యంత జాగ్రత్తతో శిష్యులు ఆ దూలానికి సూది గుచ్చి, దాన్ని పదిమందీ మోసుకుంటూ తెచ్చి గురువు సన్నిధిని నిలబడ్డారు. పేరిందేవి కూడా వారి ఐకమత్యానికి మెచ్చి, రెండ్రోజులపాటు నీళ్ళు కాచుకోడానికి సరిపడ వంట చెరకు, తాటిదూలం రూపంలో మోసుకొచ్చిన శిష్యుల్ని ప్రశంసించింది.

“ఐకమత్యం అంటే మీదేనర్రా” అంటూ ఇటు పరమానందయ్య కూడా ప్రశంసించే సరికి, ఇక వారి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. అందరూ గురువుగారికి కాల్లో విరిగిన ముల్లు తీద్దామని పోటీ పడేవారే! చివరికి పరమానందయ్య గారి సలహా ప్రకారం వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు సూది పుచ్చుకు గుచ్చడంతో, ముల్లు ఎప్పుడు బైటకు జారిపోయిందో తెలియదు గాని, గురువు గారికి ముల్లు గుచ్చుకున్న చోట అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది. దాంతో ఆయనకి ప్రత్యక్ష నరకం కనిపించిన. శిష్యులను కసురుకొని వారించారు. అప్పటికీ చివరి ఇద్దరికీ గురువుగారి పాదం కెలికే అవకాశం చేజారిపోయింది.

“ఈసారి గురువు గారికి ముల్లు గుచ్చుకోదా? అప్పుడు మేమే ముందుగా ఆయన పాదం పనిపట్టక పోతామా?” అని ప్రమాణం చేసి మరీ అక్కడ్నుంచి కదిలారు వాళ్ళు.

6) గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట

శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానం దయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది.

“ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల, ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్నాా వృద్ధాప్యం మీద పడుతూన్నందున పూర్వం మాదిరిగా నడవలేరు. మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలి. అదీగాక రాజులు-రాజాధికారులు సైతం గురువుగార్ని సలహాల కోసం కబురంపుతారు. వాళ్ళదగ్గర కెళ్ళేటప్పుడు నడిచివెళ్తే చిన్నతనంగా ఉంటుంది. అదే” గుర్రంమీద అయితే, కొంత ఠీవీ-దర్పమూనూ...” అని ఆ శిష్యపరమాణువు అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించాడు.

"గురువుగారికి మంచి గుర్రం కొనాలని ఆలోచిస్తున్నారు శిష్యులు"

అందరూ అతడి ఆలోచన ప్రశస్త్యంగా ఉందని ప్రశంసించారు. ఇంతమంది ఏకగ్రీవంగా చెపుతుంటే, అది దివ్యమైన అలోచనే అయి వుంటుందని అంచనాగా లెక్కలుకట్టే పరమానందయ్య కూడా అవునవునని తలవూపి “అలాగే కానివ్వండి! మీ అందరి దయా ఉంటే నాకు లోటేమిటీ?” అన్నారు.

“హమ్మమ్మమ్మ! ఎంతమాట గురువుగారు! మీరు పెద్దలు. మీ దయ మాయందు ఉండేలా మీరే అనుగ్రహించాలి” అనడంతో తన శిష్యుల వినయానికి మురిసి ఓ మంచి గుర్రం ఎత్తు, లావు, రంగు అన్నీ సరిగ్గా ఉండేలాగ చూసి కొనుక్కు రావడానికి ఇద్దరు శిష్యులను నియమించారు.

7) గుర్రం గుడ్డు బేరం

గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి రెండ్రోజులుగా మన ఇంట్లో పాడి అవు కనిపించడం లేదు వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని. దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికో ముగ్గురు; తగినంత వంట చెరకు సమకూర్చడానికో ముగ్గురు శిష్యులు చొప్పున నలుదిశలకూ బయల్దేరి వెళ్ళిపోయిరు.

గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులూ, ఆవుని వెదక బోయిన శిష్యులూ కలుసుకొని “అవు ఎలాగూ కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దా”మంటూ అశ్వనిపుణ శిష్యులతో కలిసి బైలుదేరారు.

అలా వెళ్ళిన నలుగురు శిష్యులకూ ఓచోట ,ఒక కోనేరు, దానిపక్కనే పచ్చని పొలం, పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడి కాయలనెన్నడూ చూడలేదు. వారికి తెలిసిందల్లా తియ్య గుమ్మడి మాత్రమే! పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి, అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారికివారే నిర్ధారించేసుకున్నారు.

“గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అందువల్ల గుర్రం గుడ్డుకొని పిల్లల్ని చేయిస్తే చౌకగా గిట్టుబాటు అవుతుంది”... అనుకొని, తిరుగుముఖం పట్టి గురువుగారి దగ్గరికెళ్ళారు.

“పోయిన ఆవు ఎక్కడా కనిపించలేదు” అని గురువమ్ము గారికి తెలియజేసి, గురువుగారితో “గురువర్యా! ఒకచోట కొన్ని గుర్రాల్నిగుర్రం గుడ్లని మాత్రం చూశాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే గుర్రం ఖరీదు అధికంగా ఉండేలా తోస్తోంది. కనుక, గుర్రం గుడ్డు కొని పిల్లల్ని చేయిస్తే...” అని ఓ శిష్యుడు అంటుండగానే “ఓహో! భేష్‌! చాలా మంచి ఆలోచన, కాని గుడ్డు పొదగాలి కదా!” అంటూ సందేహాన్ని వెలిబుచ్చారు పరమానందయ్య,

“దానికేముంది? రోజుకొకరు చొప్పున గుడ్ల మీద వెచ్చగా కూర్చొని పొదిగేస్తే పోలా?” అనేసి సమస్య తేలిగ్గా తేల్చేశారు.  గురువు గారికి తన శిష్యుల అసమాన ప్రతిభా విశేషాల మీద అపారమైన నమ్మకం , కదా! “సరే కానివ్వండి” అంటూ గుర్రంగుడ్లు ఖరీదు చేయడం కోసం మన అశ్వ నిపుణులకు కొంత ధనం ఇచ్చి పంపించారు.

దారిలో గుర్రం ఎక్కడం వల్ల గురువు గారి హుందాతనం ఎలా పెరిగేదీ ముచ్చటించుకుంటూ, ఇంతకు ముందు తాము గుర్రాలను ఎక్కడ చూసిందీ వెతుక్కుంటూ అవి నిలిచి ఉన్న పొలం దగ్గర కొచ్చారు. బూడిద గుమ్మడి కాయలూ అక్కడే అలానే ఉన్నాయి.

అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైతును చూసి “ఈ గుర్రం గుడ్డు ఖరీదుకు ఇస్తారా? ఇస్తే ఎంత చెప్తున్నారు?” అని అడిగాడొక శిష్యుడు.

మొదట వేళాకోళంగా అంటూన్నారేమో అనుకున్న ఆ రైతుకు ఇంకో శిష్యుడు కూడా ఇదే ప్రశ్న అడిగి “ఊరకే నాన్చుడు వ్యవహారాలు మాకు నచ్చవు. ఠకాఠక్‌! బేరం తేలిపోయే ఖరీదు చెప్పు!” అంటూ రెట్టించే సరికి, వీళ్ళెవరో వెర్రి బాపనయ్యల్లా ఉన్నారని గమనించేసిన ఆ రైతు బిగుసుక్కూర్చున్నాడు- బేరం చెప్పక.

“అయ్యవార్లూ! ఇవి,మహారాజుల గుర్రాలు, మేలుజాతి అశ్వాలు. వీటి గుడ్లు సాధారణంగా అందరికీ దొరికేవి కావు. మీరెంతో అక్కరలో ఉండి అడిగారు గనుక మీకు అమ్ముదామని నిర్ణయించుకున్నాను. ఎన్ని గుడ్లు కావాలి?” అన్నాడు.

“ఎన్నో అక్కర్లేదు, ఒక్కటి చాలు!” అన్నాడో శిష్యుడు. 

“ఓహో! ఈ మాత్రానికేనా? గుడ్డు ఖరీదు నలభై వరహాలు అన్నాడు రైతు.

ఏదైనా కొనేటప్పుడు బేరంచేసి కొనాలని, గతంలో గురువుగారొక సారి అనడంతో, “చాలా ఎక్కువ చెబుతున్నావయ్యా!” అన్నాడు ఆ సంగతి గుర్తొచ్చిన శిష్యుడు.

“నేను ముందే చెప్పాను, ఇది మేలుజాతి గుర్రం గుడ్లని, ఆపైన మీ ఇష్టం. అంతగా మీరు అడుగుతున్నారనీ-పైగా బాపనయ్యలు అడిగితే లేదనకూడదనీ అమ్ముదామనుకున్నాను. సర్రెండి! ఓ ఐదు వరహాలు తగ్గించివ్వండి” అన్నాడు ఎంతో ఉదారంగా ఆ రైతు.

అదే మహద్భాగ్యం లనుకొని లెక్కించి 35 వరహాలూ ఆ రైతు చేతిలో పోసి, అతడిచ్చిన గుర్రం గుడ్డును నెత్తిపై పెట్టుకుని వంతుల వారీగా మోసుకు వస్తున్నారా శిష్యులు.

గుడ్డు నెత్తిపై పెట్టుకున్న వాని కాలికి రాయి తగిలేసరికి, అతడు తూలి పడబోయి నిలదోక్కు కున్నాడు గాని నెత్తిపైనున్న బూడిద గుమ్మడి (వారి లెక్క ప్రకారం “గుర్రం గుడ్డు) దఖేల్న పడి పగిలింది. చెక్కలైన బూడిద గుమ్మడి పొదల్లోకి వెళ్ళి “పడేసరికి ఆ పొదల్లో తల దాచుకుంటూన్న ఓ చెవుల పిల్లి ఛెంగున గెంతుతూ పరుగుటెత్తింది.

“ఓసి! దీందుంపతెగ! ఇది పగిలీ, పగలగానే పిల్ల బైటికొచ్చిందే! చూడు! ఎలా పరిగెత్తు తున్నదో! ఇదేగాని పెద్దదైతే రెక్కల గుర్రంలా ఆకాశంలో దూసుకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అనుకుంటూ తలోవైపు కాపు కాసి దాన్ని పట్టుకోజూశారు. అది వారిని ముప్పుతిప్పలు పెట్టి  బాగా అలుపొచ్చేక తప్పించుకు పారిపోయింది.

ఇక, గుర్రప్పిల్ల చేజారిపోయిందని రూఢి చేసుకున్నాక, బాగా డస్సిపోయిన శిష్యులు చెట్టుకింద మేను వాల్చారు. గుర్రం గురించిన సంగతులు తాము విన్నవీ, కన్నవీ ముచ్చటించుకుంటూ.

ఆ దారిన పోతున్న ఓ బాటసారి వీళ్ళ మాటలు విని, సంగతి తెలుసుకొని “ఓయి మీ అమాయకత్వం కూల! గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా?” అని అడిగాడు.

“ఏం? మేం నీ కంటికి వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నామా? గుర్రం గుడ్డు ఖరీదు చెయ్యడానికి అవసరమైన సొమ్ము మా గురువుగారే ఇచ్చారు తెల్సా!” అన్నాడో శిష్యుడు.

“ఓహో! మీ గురువు మిమ్మల్ని మించిన అతితెలివి మంతుడన్న మాట అనుకుని, ఇక వీళ్ళని సమాధాన పర్చడం కష్టమని తెలిసి “సర్లెండి! ఇప్పుడు మీ గురువుగారికి ఏం చెబుతారు? సొమ్ము నష్టపోయి, గుర్రం కూడా దక్కకపోతే ఆయన ఆగ్రహించరా?” అన్నాడా బాటసారి.

“నిజమేనయ్యో! ఇంతసేపూ మాకు ఆ ఆలోచనే రాలేదు. ఏలా? ఇప్పుడేమిటి దారి?” అని వితర్కించుకో సాగారు ఆ శిష్యపరమాణువులు.

దానికా బాటసారి, తనవద్ద ఓ గుర్రం ఉందనీ వారి భయం పోగొట్టేలా ఎంతో ఉదారంగా దాన్ని వారికి దానంగా ఇచ్చేయదల్బుకున్నా ననీ అన్నాడు.

“ఆహా! విధి విలాసం! ఇంతలోనే భగవంతుడు మనకి భయం కల్పించి, అంతలోనే దాన్ని పోగొట్టాడు. ఈ అపరిచితుడెవరో మనకు తెలీకున్నా విలువైన గుర్రాన్ని దానంగా మనకే ఇస్తున్నాడంటే విధి విలాసం కాక ఇంకేమిటి?” అనుకొని శిష్యులు ఆ “మహాత్ముని” వెంట వెళ్ళారు.

అతడు తన ఇంటికి తీసుకెళ్ళి, తనవద్ద ఉన్నగుర్రాన్ని వాళ్ళపరం చేశాడు. ఇది దానంగా ఇచ్చినది కనుక-దీన్ని "మీరు దాన విక్రయాధికారసహితంగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు.

“గుడ్డు పోతే పోయింది, స్వారీకి సిద్ధంగా ఉన్న గుర్రమే దక్కింది. ఈ సంగతి తెలిస్తే గురువుగారెంత సంతోషిస్తారో కదా! సుముహూర్తం దగ్గర్లో ఉంటే, గురువు గారి గుర్రపు స్వారీ త్వరలోనే కళ్ళారా చూసే భాగ్యం మనదే” అనుకుంటూ దాన్ని తోలుకొని వెళ్ళి గురువుగారి ముందు నిలిపి సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పారు.

శిష్యుల ఆసక్తికరమైన కథనం వింటూ, గురువుగారు గుర్రాన్ని పరీక్షగా చూడక పోయినా, మరో ఇద్దరు శిష్యులు మాత్రం “ఇది అంత మేలుజాతిది కానట్టుంది. ఓ కన్ను కనబడదు, చూడబెతే వాతంతో దీనికో కాలు లాగేసినట్లు ఉంది” అని పరీక్షించి తేల్చారు. దాణా ఖర్చు దండగ అని అతడెవరో మనకి దీన్ని అంటగట్టి ఉంటాడనీ నిర్ధారించారు. “ఎవరికెంత ప్రాప్తమో అంతే!” అని వేదాంతం పలికారు గురువు గారు.

8) పురాణం చెప్పిన శిష్యులు

వర్షాకాలం నాలుగు నెలలూ గడిచిపోగానే, గృహంలో అన్నీ నిండుకున్నందున, పరమానందయ్య శిష్య సమేతంగా మళ్ళీ గ్రాసం కోసం గ్రామాలను సందర్శించే కార్యక్రమాన్ని రూపొందించారు.

ఓ శుభ ముహూర్తాన ఒక గ్రామం బయల్దేరారు. ఊరి పొలిమేరల్లోనే వారిని చూసిన గ్రామపెద్ద నమస్కరించి శిష్యులతో సహా వేంచేసిన పరమానందయ్య గారిని కుశల ప్రశ్నలడిగి ఊళ్ళోకి ఆహ్వానించాడు.

గ్రామ చావడిలో వారికి విడిది ఏర్పాటు చేశాక “మహాత్మా! చాలా రోజులకు మాగ్రామానికి వేంచేశారు. మీరాక మాకు చాలా సంతోషదాయకం. ఈ కార్తీక మాసంలో పర్వదినాల సందర్భంగా పురాణ కాలక్షేపం చేయండి” అంటూ వేడుకున్నారు.

గురువుగారికి తన పదిమంది శిష్యులమీదా అపారమైన అభిమానం. పౌరులచేత వారిని కూడా పండితులుగా అంగీకరింపచెయ్యాలని ఉబలాటం.

అందువల్ల గ్రామస్తులతో “పురప్రజలారా! మీకు నాయందు గల అపారమైన అభిమానానికి, పురాణ కాలక్షేపం భాద్యత అప్పగించారు. కాని... నాకా వయసు మళ్ళుతోంది. ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నాను.

అదీగాక-నా శిష్యుల్ని తక్కువగా అంచనా వేయకండి! వారిని నా అంత  వాళ్ళుగా తీర్చిదిద్దడానికి చాలా కృషి చేశాను. రామాయణ, భారత, భాగవతాలు వారికి కరతలామలకాలు" అని వారిని ఒప్పించి "రెండు మూడు రోజుల పాటు మేము మీ గ్రామంలో ఉంటాం.

కనుక పుర జనులకు ఏది కావాలంటే అది పురాణ కాలక్షేపం వినిపించండి” అని శిష్యులకు చెప్పి, తాను విశ్రాంతి తీసుకున్నారు గురువుగారు.

గ్రామ చావడి దగ్గరే పురాణ కాలక్షేపం ఏర్పాటయింది. రాత్రి కాగానే గ్రామస్తులంతా. భోజనాలు చేసి, అక్కడ సమావేశమయ్యారు.

పరమానందయ్య గారి సూచన మేరకు ఒక శిష్యుడు వేదిక మీదికి వచ్చి “సభకు నమస్కారం” అన్నాడు. “అయ్యోరంటే' నిజంగా  అయ్యోరే! సభ అంటే ఎంత వినయం? ఎంత వందనం?” అని ముచ్చట పడ్డారందరూ.

“సోదర సోదరీ మణులారా! నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా?” అని అడిగాడు ఉఫోద్గాటంగా.

నిజానికి గ్రామ పెద్దలతో సంభాషిస్తూ “ఈ మూడు రోజులూ భాగవత పురాణం చెప్పుకొందాం" అని నిర్ణయించింది గురువుగారే, అదే సంగతిని గ్రామంలో చాటింపు కూడా వేయించారు. అయితే వినయంలో, అందులోనూ పెద్దల పట్ల విధేయత గల విషయంలో ఎంతో తెలిసివున్న అ గ్రామస్తులు “తమకు ఏమీ తెలియదన్నట్లే” ఉంటారు అది పెద్దల పట్ల చూపే మన్ననకు తార్మాణం. శిష్యుడీ విధంగా అనగానే “మాకు తెలీదు స్వామీ” అన్నారందరూ.

“అలాగా! ఐతే తెలీని వారికి ఏం చెప్పినా తెలీదు” అనేసి వేదిక , దిగి వెళ్ళిపోయాడా శిష్యుడు. ఈ సంగతిని గురువుగారి చెవిన వేద్దామంటే, ఆయన అప్పటికే శిష్యుడిమీద భరోసాతో సుష్టుగా తిని గుర్రుకొడుతున్నారు.

వార్ని నిద్రలేపడం అపచారమని భావించి, ఆ రాత్రికి గుసగుసలాడుకొంటూ నిరుత్సాహంతో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

మర్నాడు.....

మళ్ళీ పురాణం వినాలన్నా ఆసక్తికొద్దీ జనులు తయారయ్యారు.

ఈసారి ఇంకో శిష్యుడ్ని వేదిక ఎక్కించిన గురువుగారు బాగా నమ్మకంతో తిన్నవెంటనే ముంచుకొచ్చిన నిద్రను ఆపుకోలేక శయనించారు.

వేదిక ఎక్కిన శిష్యుడు “నేను చెప్పబోయే పురాణం మీకు తెలుసా?” అని మొదలుపెట్ట బోయాడు. గతరాత్రి అనుభవం దృష్టిలో ఉంచుకొని, తెలీదంటే ఏం తంటా వస్తుందో అన్నట్లుగా గ్రామస్తులు, “ఆ! ఆ! తెలుసు! తెలుసు!” అంటూ తలలు ఆడించారు.

“తెలిసిన వాళ్ళకు ఇక చెప్పడానికే ముంటుంది?” అనేసి శిష్యుడు వేదిక దిగి వెళ్ళిపోయాడు. జనులకు ఆ రాత్రీ నిరుత్సాహమే ఎదురైంది. విషయం పరమానందయ్య గారికి చెబుదామంటే ఆయన గుర్రు కొడుతున్నారాయె. నిద్ర లేపడం అపచారం గదా! ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

మూడోరోజు రాత్రి కూడా పురాణం వినడానికి యథా ప్రకారం వచ్చారు ప్రజలు, ఒకవేళ గత రెండు రోజుల మాదిరిగా పరమానందయ్య గారి శిష్యుడు “నేను చెప్పబోయేది తెలుసా?” అని అడిగితే సగం మంది తెలుసునని, సగం మంది తెలీదని చెపుదాం అని కూడబలుక్కొని వచ్చారు. వాళ్ళు.

ఆరోజు దేవభూతి పురాణం చెప్పడానికి వేదిక ఎక్కాడు. “నేను చెప్పబోయే పురాణం మీరెరుగుదురా?” అన్నాడు నాందిగా, ముందే అనుకున్న ప్రకారం కొందరు తెలసనీ, కొందరు తెలీదనీ చెప్పారు. మొదటి రెండురోజులూ వేదిక ఎక్కిన ఇద్దరికంటే దేవభూతి కాస్త తెలివైనవాడు కావదం వల్ల “ఈ మాత్రానికి నేను దేనికీ? మీలో తెలిసిన వాళ్ళు తెలీని వాళ్ళకి చెబితే సరిపోతుంది” అని గిరుక్కున దిగిపోయాడు.

ఇక గ్రామస్తుల సహనం నశించడమే గాక, గురుశిష్యుల అతితెలివి తెల్లారినట్లే ఉందనుకుంటూ, తెల్లారేలోగా చావడి ఖాళీచేసి వచ్చిన దారినే పొమ్మని మర్యాదగా సాగనంపారు.

9) గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ

“గురుదేవులు దర్చంగా, ఠీవీగా గుర్రంమీద వెళ్తూ ఉంటే, అప్పుడు చూడాలి వారిదర్జా” అంటూ శిష్యులు రెచ్చగొట్టింది లగాయితు, గుర్రపు స్వారీ మీద నుంచి పరమానందయ్యకు మనస్సు మళ్ళింది కాదు.

ఓ రోజున కాస్త దూరపు గ్రామస్తులు శిష్యులతో సహా తమ గ్రామాన్ని పునీతం చెయ్యాలంటూ పరమానందయ్య గారికి కబురంపారు. ఇకనేం? ఎలాగూ దూర ప్రయాణం కనుక “గుర్రపుస్వారీ ఇహం శ్రేష్టం అని శిష్యులు మరోసారి రెచ్చగొట్టడంతో, తానెంతో మొహమాటపడి ఒప్పుకుంటున్నట్లుగా సరే అన్నాడాయన.

అదే మహద్భాగ్యమన్నట్లుగా వారంతా పరమానందయ్యను భద్రంగా గుర్రంమీద కూర్చోబెట్టి వెనుకనే వాళ్ళు పదిమందీ అనుసరించసాగారు.

గుర్రానికి దాణా అందించడాని కొకరు, కళ్ళెం పుచ్చుకుని లాగే వారొకరు, అదిలించే వారొకరు.... ఇలా సాగుతున్నదా ప్రయాణం. ఇంతలో ఓ చోట పిల్లకాలువ ఒకటి దాటబోయిన ఆ గుడ్డి గుర్రం దభేల్‌ మని కూలబడింది: ఆ గుర్రంతో పాటు గురువు గారు సైతం కూలబడి పోయారు.

అంత వృద్ధాప్యంలో అమాంతం ఊహించని రీతిగా పడేసరికి పాపం! పరమానండయ్య నడుం జారిపోయింది.

“ఓరి నాయనో! చచ్చానర్రా! లేవదీయండర్రా”.... అంటూ శోకాలు తీస్తుంటే, వెనుక కాళ్ళమీద నిలబడి ముందరి కాళ్ళు గాల్లో 'పైకత్తి సకిలిస్తున్న గుర్రం ఛాటికి శిష్యులు చెల్లా చెదురై తలొక మూలా నక్కారు.

కొంతసేపటికది శాంతించాక నెమ్మదిగా ఒక్కొక్కరే పరమానందయ్య గార్ని సమీపించారు.

గురువుగారికి చెయ్యి అందించి ఒకరు కాళ్ళుపట్టి ఇద్దరు నడుం దగ్గర ఎత్తి పట్టుకుని నలుగురూ పడ్డచోటు నుంచి లేవదీసి చెట్టుక్రింద విశ్రమింప జేసి, అక్కడే దొరికిన వెడల్పాటి ఆకులతో గాలి విసరసాగారు.

ఇంకో ఇద్దరు నడుంపట్టు ఉపశమింప జేయడానికి ఆకు పసర్ల నిమిత్తం, చెట్ల పొదలలో వెదకసాగారు. అంతెత్తు నుంచి గుర్రంమీద కెగరేసి పపేయడంతో బైటిక్కనిపించని విధంగా లోలోపల ఆయన తుంటి ఎముక విరిగగిపోయి, కొద్దిసేపటికే బుసబుసమని వాపు పొంగుకొచ్చింది. ఆయన బాధ వర్ణనాతీతం. నిల్చోలేక, కూర్చోలేక, పడుకోలేక నానా అవస్తా పడుతుంటే, గురువు గారి బాధ చూడలేక శిష్యుల్లో ఇద్దరు మరీ సున్నిత మనస్కులు కళ్ళనీళ్ళు పెట్టుకుని దారిన పోయే వారినల్లా “కనికరించి కాస్త వైద్యులెవరన్నాఉంటే తెలియజేయండి బాబూ” అంటూ 'బ్రతిమాలుకో సాగారు.

ఎట్టకేలకు ఆ సాయంత్రానికి వారి అదృష్టమో; గురువు గారి పట్ల దైవం చూపిన కరుణతో గాని పొరుగూరి సంచికట్టు వైద్య చింతామణి అటువైపుగా వస్తూ, పరమానందయ్య గారిని గుర్తించి, సంచిలోంచి ఏదో లేపనం తీసి ఆయనకు బాగా పట్టించి, కాస్త లేచేందుకు వీలుగా ఉపశమనం కలిగించాడు.

ఈలోగా గుడ్డిగుర్రం ఇంకో విపత్తు తెచ్చిపెట్టింది. శిష్యులంతా గురువుగారికి ఉపచారాలు చేస్తూ, నానా హైరానా పడుతూంటే ఎప్పుడు వెళ్ళిందోగాని చల్లగా పక్కనున్న చేల్లోకి వెళ్ళి మేయసాగింది. ఆ చేను గల రైతు ఊరుకుంటాడా? ఆ గుర్రాన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశాడు.

“పిల్లకాలువలో దాని ప్రతిబింబమే అదిచూసి జడుసుకొని ఉంటుంది. లేకపోతే సగం దూరం ప్రయాణం సజావుగానే సాగిందికదా!” అని తేల్చారు శిష్యులందరూ కలసి.

వాళ్ళ అభిప్రాయంతో పరమానందయ్య ఏకీభవించక తప్పలేదు. ఎందుకంటే ఇంకా ప్రయాణించ వలసిన దూరం దాదాపు సగం వరకూ ఉంది. గుర్రం మీద కూర్చుని నడుముకు పై పంచెతో కలిపి గుర్రానికి కట్టేసుకుంటే, ఈసారి పడిపోకుండా ఉండొచ్చని బుద్ధిశాలురైన శిష్యులు ఆ విషయం గురువుగారికి సూచించారు.

చూడబోతే అదే నయంలా ఉంది. లేకుంటే ఈ నడుం నొప్పితో నడిచి అంతేదూరం గ్రామం ప్రయాణించడం కష్టం అని పరమానందయ్యకు కూడా బోధ పడింది. కానీ, అప్పటికే ఆయనకు గుర్రంమీద విరక్తి కలిగిపోయింది.

తీరా వెతికితే, గుర్రం అక్కడలేదు. పుంతలో ఎక్కడో చెట్టుకు కట్టేసి ఉండడం ఓ శిష్యుని కంట బడింది. అక్కడికెళ్ళి అతడ్ని దబాయించారు.

ఆ రైతు మండిపడి “ఏడ్చినట్లుంది నాచేనంతా నష్టపరచింది. పరిహారం ఇస్తే తప్ప గుర్రాన్ని వదిలేది లేదు” అని తిరగబడ్డాడు.

స్థలం కాని స్థలంలో పేచీలెందుకు? మనవద్ద ఉన్న పది వరహాలూ పడేస్తే సరి! అతదే ఊరుకుంటాడని పరమానందయ్యగారు అనడంతో, అలాగే కానిచ్చారా శిష్యులు. అతి ప్రయాసమీద: ప్రయాణం కొనసాగించి ఆగ్రామం చేరుకున్నారు.

10) ఫలించిన జ్యోతిష్కుని మాట

చూస్తూ చూస్తుండగానే శీతాకాలం, ఓ వేసవికాలం కూడా గడిచిపోయింది. ఇక నేడో రేపో తొలకరి మొదలవుతుందనగా, ఓ శిష్య పరమాణువుకి గొప్ప ఆలోచన కలిగింది. ఓ రోజున భోజనాలయ్యాక తీరిగ్గా గురుపత్నినీ, గురుదేవుల్ని మధ్యన కూర్చోబెట్టి తామందరూ చుట్టూ చేరి ఉండగా ఆ శిష్యుడు ఇలా మొదలెట్టాడు......

“గురువుగారూ! వర్షాకాలం మళ్ళీ మొదలయ్యేలాగా ఉంది. మన పంచ కళ్యాణి గుడ్డిదో, కుంటిదో ఐతే అయింది గాని అప్పుడప్పుడు

దూర ప్రయాణాలకు “గుడ్డిలో మెల్లి మాదిరిగా ఉపయోగ పడగలదని మాకు తోస్తోంది. ఏదో...మాతోపాటు ఇంత గడ్డి పడేస్తే మేస్తూ మన పంచన పడి ఉన్నందుకు ఆ గుర్రం మనకి ఉపయోగ పడేలాగ మనమే మల్చుకోవాలి కదా!” అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు.

“వద్దు నాయనా! నాకు గుర్రంమీద ఆసక్తి ఇక నశించిపోయింది. విరక్తి కూడా కలిగేంతగా, ఇప్పటికీ నడుం ఓ పక్క కటక్‌మంటూ బాధిస్తూనే ఉంది...” అన్నాడు పరమానందయ్య.

“మీరు అలా అంటే ఏం చెప్పడం గురువుగారూ. దూరపు గ్రామాల నుంచి. ఆహ్వానాలొచ్చినపుడు మీరు పడే ప్రయాస చూడలేక పోతున్నాం! అసలు నేను చెప్పేదేమి అంటే.... 

ఇంతకు ముందు దాన్ని సంరక్షించే యజమాని సరిగ్గా చూడక, ఆ గుర్రాన్ని నానా పొట్లూ పెట్టి ఉంటాడు. అంచేత దాణా అదీ అలాగే ప్రవర్తించిందేమో! మనం దానికి మంచిదాణా వేస్తున్నాం! అలాగే దాని సంరక్షణ కూడా సరిగ్గా చూస్తే అదీ మనపట్ల విశ్వాసంతో మంచి సేవ చేస్తుందని నా ఉద్దేశం. ఈ వర్షాకాలంలో వర్షాలకు అది తడిసిపోయి, రోగం బారిన పడకుండా ఉండడానికి దానికో చిన్న పాక వేస్తే ఎలా వుంటుందని? మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం!” అని ముగించాడు.

ప్రియ శిష్యుడు చెప్పినది బాగానే ఉన్నట్లు తోచినా, “ఏమోనర్రా... ఈ గుర్రంమీద స్వారీ కన్నా ఆ శ్రీమన్నారాయణుడిచ్చిన రెండుకాళ్ళూ సలక్షణంగా ఉపయోగించుకోవడమే ఉత్తమం. అని నాకు అనిపిస్తున్నది. ఇక.... పాక ఏర్పాట్లను గురించి అంటారా? అది సేవ చేయడం నేను ఆశించడం లేదు కనుక, నాకు దాని సంరక్షణ పట్ల కూడా ఆసక్తి లేదోమోనని మీరు భావించరాదు.

ఏ క్షణాన అది మన ప్రాంగణంలోనికి అదుగిడిందో, ఆ క్షణం నుండీ దాన్ని సరిగ్గా చూడవలసిన బాధ్యత మనదే! అందువల్ల గుర్రం గురించి మీరు శ్రద్ధ తీసుకుంటానంటే నేనెందుకు అభ్యంతరం చెప్తాను! అలాగే కానీయండి” అని అనుమతిచ్చేశాడాయన.

చెట్లెక్కడంలో నిపుణుడైన ఓ శిష్యుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కూర్చోడానికి వాటంగా ఉన్న ఓ కొమ్మనెన్నుకొని దానిమీద కూర్చొని అదేకొమ్మ మొదలు నరక సాగాదు.

"తాను కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాడు శిష్యుడు"

ఇదిచూసి ఆ దారిన పోతూన్న బ్రాహ్మణుడొకడు “ఒరే అబ్బీ! నీకు చావు దగ్గర పడిందా ఏం?... కొమ్మతో సహా విరిగి కిందపడితే నడుం మరి లేవదు” అని రెండడుగులు ముందుక్కదిలాడో లేడో అతడన్నట్లుగానే కొమ్మ విరిగి శిష్యుడు దభేల్‌మని పడ్డాడు.

అదృష్టవశాత్తు పొదల్లో పడబట్టి సరిపోయింది గానీ, లేకుంటే ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లు నడుం విరిగి ఉండేదే కదా” అని గ్రహింపునకు వచ్చింది. “ఆయనెవరో సామాన్యుడై ఉండడు. లేకుంటే అంత ఖచ్చితంగా నేను పడతానని ఎలా చెప్పగలిగి ఉంటాడు? ముమ్మాటికీ అతడు జ్యోతిష్యంలో దిట్ట” అని స్థిరభిప్రాయానికొచ్చేసి, పడుతూ, లేస్తూ ఆయన వెంట పరుగెత్తి ఆయన దారికి అడ్డంపడి “స్వామీ! మీరు మహాత్ములయి ఉంటారు. 

సందేహం లేదు. నేను పడతానని ఇలా అన్నారో లేదో అది జరిగింది. కనుక మీరు అసాధారణ పండితులు. మాగురుదేవులు పరమానందయ్య గారు. ఆయనకి వార్ధక్యం" సమీపించింది. అయన ఎప్పుడు పోతారో అని మాకు భయం. కాస్త ముందుగా తెలిస్తేనో ఆయన్ను రక్షించుకోడానికి సర్వ ఉపాయాలూ వెదకొచ్చన్నది మా అభిప్రాయం. దయచేసి వారి అంత్యఘడియలు ఎలా వస్తాయో ఎప్పుడొస్తాయో సెలవివ్వండి” అని ప్రాధేయ పడ్డాడు. "

"గురువుగారి చావుగురించి చెప్పమని ప్రాధేయపడుతున్నాడు శిష్యుడు"

ఆ బ్రాహ్మణునికి మతిపోయింది. ఉన్న విషయాన్ని చెబితే దాన్ని జ్యోతిష్యానికి అంటగట్టి ఆలోచిస్తున్నాడితడు. చూడబోతే మూర్కశిఖామణిలా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాల్సిందే” అనుకున్న ఆ బ్రాహ్మణుడు “శిరఃపాద శీతలం ప్రాప్తి జీవనాశం” అని అన్వయం లేని రెండు ముక్కలు చెప్పి ముందుక్కదిలాడు.

అదేమాట పదేపదే వల్లించుకుంటూ వెనక్కు వెళ్ళిన శిష్యుడికి ఎంత సేపటికీ దానికి అర్ధం తెలియలేదు. అర్థంలేని చదువు వ్యర్థమంటారు కనుక మళ్ళీమళ్ళీ ఆ బ్రాహ్మడినే అడిగాడు శిష్యుడు.

“నాకెక్కడ దాపురించావురా నాయనా?” అనుకుంటూ “తలా, కాళ్ళూ చల్లబడ్డప్పుడు. ఆ మాత్రం తెలీదా?” అనేసి ముందుకు సాగిపోయాడా బ్రాహ్మణుడు. శిష్యుడూ ఇంటిదారి పట్టాడు.

Paramanandayya Sishyulu Comedy Stories in Telugu

11) గుర్రపుశాల యోగం లేని గుర్రం

ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన.

శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని “గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్ధినం. నేను నిజానికి మరణించాల్సింది” అంటూ జరిగిన సంగతంతా చెప్పి, “అ ప్రకారం ఆ మహానుభావుడు గొప్ప జ్యోతిష్యుడని నా బుద్ధి కుశలత వల్ల తెల్సుకోబట్టి మీ గురించి కూడా ఆయన్ను అడిగాను. వారు ఇలా చెప్పారు” అంటూ “కాళ్ళూ చేతులూ చల్లబడిపోతే మీరు మాకు దక్కరు గురువుగారో” అంటూ శోక్తాలు తీయసాగాడు.

ఆ మాటలు వింటూనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. శిష్యులంతా గురువుగారి ముఖంమీద నీళ్ళుకొట్టి లేవదీశారు.

కాస్త తెప్పరిల్లాక గురువుగారు “నాయనలారా! ఆ మహానుభావుడెవరో నిజమే చెప్పి ఉండొచ్చు! ఎంతటి వారికైనా మరణాన్ని తప్పించుకో శక్యమా? అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! “శిరః పాద శీతలం" అని ఆయన చెప్పినందు చేత ఈరోజు నుంచీ తలకు స్నానం మానేస్తాను. తలమీద ఎటూ వెంట్రుకలు లేవు. గోష్పాద మంత పిలకమీద ఇన్ని పసుపునీళ్ళు చిలకరించి శుద్ధి చేసుకోవచ్చు! అలాగే పాదాలకు తడి తగలనీయకుండా చూడంది” అన్నారు.

గురువుగారి మాటని వేదవాక్యంలా పాటించే శిష్యుడొకడు “కాళ్ళు కడుక్కుంటే తడి అవుతుంది కనుక కాళ్ళకు పసుపునీళ్ళు జల్లుకోండి అన్నాడు.

“అదికాదురా అర్ధం! గురువుగారు కాళ్ళు కడుక్కోగానే తక్షణం ఏదైనా పొడి వస్త్రంతో ఆయన కాళ్ళు ఒత్తి తుడిచేయాలి” అని గురువమ్మగారు సెలవిచ్చారు.

అనంతరం... అంతా కలసి గుర్రపుసాల ఏర్పాట్లలో మునిగారు. రాటలు పాతారు.. పైకప్పుకి తాటాకులు ఎక్కడ నుంచి తేవాలి? ఊరి శివార్లలో తాటితోపు ఉంది. అక్కడికెళ్ళి అడిగితే, “చెట్టు ఎక్కగలిగే వారికి ఎన్ని తాటాకులైనా దొరక్కపోవడం అనేది ఉండదు” అని చెప్పారు పనిపాట్లు చేసుకొనే రైతు వర్గం వారు.

ఇంతకు ముందు కొమ్మ మీదనుంచి పడి, చావు తప్పిన శిష్య పరమాణువుని చెట్టెక్కమన్నారు. “నాకు అడ్డమైన చెట్లూ ఎక్కడమైతే వచ్చు! తాడివలె నిట్టనిలువు చెట్లు కష్టపడి ఎక్కినా దిగడం రాదు” అన్నాడు.

వాళ్ళ మాటలు విని అక్కడే వున్న ఓ శూద్ర యువకుడు జాలిపడి “సర్లెండి అయ్యవార్లూ! నాకేదో ఉల్లిపరక, ఊరగాయ బద్ద ఖర్చు ఇచ్చుకుంటే మీక్కావలసినన్ని తాటాకులు కోసిస్తా” అన్నాడు.

“ఆ పన్చేయ్యి బాబ్బాబు! నీకు పుణ్యం ఉంటుంది”. అంటూ పరమానందయ్య శిష్యులు ఆ యువకునికి పాదాబి వందనం చెయ్య బోయారు.

అతడు కాళ్ళు వెనక్కి లాగేసుకుంటూ “తప్పు అయ్యవార్లూ! కులానికి శూద్రుడినైనా, గుణానికి మాత్రం కాను. తమర్ని భూసురులంటారు. అంటే భూలోకాన దేవతల వంటివారు అన్నమాట! మీరు మాకు నమస్కరిస్తే, అది మాకు మన్నన కాదు. ఆయుక్షీణమని ధర్మశాస్త్రం. అంతేకాదు! మీబోటి వారిచేత పాద నమస్కారాలు చేయించుకుంటే స్తీ మూలకంగా ఆకస్మిక మరణం కూడా” అని సమాధానం చెప్పేసరికి “ఔరా! మనకే తెలీని విషయాలెన్ని తెలుసో ఈ కుర్రవాడికి. 

అందుకే జ్ఞానం ఒకరి సొత్తు కాదన్న నిజాన్ని బ్రాహ్మణులమైన మనం ఒప్పుకుని తీరాలి” అంటూ తీర్మానించుకున్నారు.

“సరే అబ్బీ! నీకు గురువుగారితో చెప్పి, అంతో ఇంతో ఇప్పిస్తాం గానీ, తాటాకులు కొట్టిపెట్టు” అన్నారు.

అన్నీ అనుకూలించి, ఆ చిరకాలంలోనే పాక తయారైంది. కాని అందులోకి గుర్రాన్ని తోలగా, దాని దేహం అందులో ఇమిడింది కాదు! ఇరుగ్గా ఉండడంతో, వేసిన పాక వేసినట్టే కూలిపోయింది. దానికి సాలలో నివశించే యోగం లేదని సరిపుచ్చుకున్నారు గురుశిష్య సమూహం.

12) శొంఠికొమ్ము వైద్యం

గ్రామగ్రామానా ఉన్న అనేకానేక శిష్యకోటిలో రామావధానులు ఒక్కడు. అతడు అప్పుడప్పుడూ పరమానందయ్య గారిని సందర్శిస్తూ నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని వెళ్తూందేవాడు.

నా అనేవాళ్లేవరూ లేని అవధాన్లుకి అన్యాయార్జితమైన ఆస్థి చాలా ఉంది. ఒకసారి తన ఇంటికి దయచేయమని అతడు గురువుగార్ని ఎప్పుడూ కోరుతూండడం, ప్రతీసారీ అలాగే అంటూ పరమానందయ్య వాయిదా వెయ్యడం జరుగుతూ వస్తోంది.

ఇక అంత్యదశ సమీపించడంతో..... అవధాన్లు తాను రాలేక గురువుగార్నే శిష్యసమేతంగా రమ్మని కబురంపాడు. ఇక తప్పదని బయల్దేరారు అందరూ.

వెళ్ళాక వారూహించని విధంగా అవధాన్లు కన్నీళ్ళ పర్యంతమై “నేనిక బతకను గురువుగారూ!” అంటూ బావురుమన్నాడు. “భయపడకు” అని ధైర్యం చెప్పి “నా శిష్యులలో కొందర్ని వైద్యంలో పరిపూర్జులను చేశాను. వారి వైద్యంతో నువ్వు ఇంచక్కాలేచి తిరగ్గలవు” అన్నారు పరమానందయ్య,

వైద్యంలో ఒకేఒక్క అంశం తెలిసిన నలుగుర్నీ అవధానికి వైద్యం చెయ్యమని పురమాయించారు. ఒకడు శొంఠిపొడుని మాత్రలుగా కట్టి ఇచ్చాడు. ఇంకొకడు శొంఠకొమ్ము గంధం అరగదీసి అవధానికి ఒళ్ళంతా పట్టించాడు. ఇంకొక శిష్యుడు శొంఠి కషాయం ఆరారా పట్టించసాగాడు. మరొక శిష్యుడు నిమ్మకాయంత శొంఠి ముద్దవలె నూరి నదినెత్తిన పట్టు వేశాడు. ఈ యావత్‌ శొంఠి వైద్యం అపారమైన వేడిమిని పుట్టించి, అవధాని హాహాకారాలు చేయసాగాడు. “చచ్చాను మొర్రో” అని గోల పెట్టసాగాడు.

"శిష్యులు చేస్తున్న శొంఠి వైద్యానికి గోలపెడుతున్నాడు అవధాని"

“ఎంత అరచి గీ పెట్టినా, చివరికి మీ ప్రాణాలు మాత్రం ఎటూ పోనివ్వం! మీ దేహంలోనే మీ ప్రాణాల్ని బందీలుగా చేస్తాం!” అంటూ అవధాని నవరంధ్రాల్లో శొంఠిముద్ద కూరారు పదిమంది శిష్యులూ కలిసి. ఎప్పుడో జరగాల్సిన పని తక్షణమే జరిగి అవధాని హరీమన్నాడు. శొంఠకొమ్ములు నాణ్యమైనవి దొరక్కపోవడం వల్లనే ఆయన ప్రాణాలు పోయాయని, లేకుంటే తప్పకుండా ప్రాణాలు నిలబడేవని శిష్యులు వాపోయారు. పరమానందయ్య వారితో ఏకీభవించారు.

13) నీటిగండం తప్పిన గురువు గారు

రామావధాన్లు ఏకాకి అవడం వల్ల, పోతూపోతూ మఠానికి రాసేసిన ఆస్తి యావత్తు పరమానందయ్య గారి పరమైంది. ఆ సామానులు బండిమీద వేసుకొని, ఇంటిదారి పట్టిన పరమానందయ్యకు తన శిష్యుల జాగ్రత్త మీద గల అపారమైన నమ్మకం కొద్దీ “నాయనా! బండిలోంచి ఏది క్రింద పడినా తీసి లోపల వేస్తారు కదా!” అని చెప్పి కునుకు తీయసాగారాయన.

దానిక్కారణం ఉంది. అంతకు ముందొకసారి ప్రయాణంలో బండిలోంచి గురువు గారి మరచెంబు క్రింద పడినాకూడా గుర్వాజ్ఞ లేదని దాన్నట్లాగే చక్కా వదిలేసి వచ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొకసారి బండి కుదుపులకి అంతకంటే విలువైన గురుపత్ని కాలి పట్టాల్తు జారిపోయాయి. అవీ అంతే. దాంతో ఆయన ఈ ప్రయాణం పెట్టుకోగానే శిష్యులకు జాగ్రత్తలు చెప్పి నిద్రపోసాగారు.

కొంత సేపటికి ముఖంమీదకి మెత్తని జిగురు లాంటి ముద్దవంటి పదార్ధం కంపుకొడుతూ ఠాప్‌మని పడేసరికి ఉలిక్కిపడి లేచి చేత్తో తడిమి చూసుకోగా ఇంకేముందీ అసహ్యంగా తగిలిందాయన చేతికి. అది "ఎద్దుపేడ."

“ఇదేంట్రా?” అని విసుక్కున్నారాయన “మీరేకదండీ క్రింద పడిన ప్రతీదీ బండిలో వేయమన్నారు” అని శిష్యుల జవాబు.

వెంటనే బండి అపించి చెరువులో ముఖం కడుక్కుందామని వెళ్ళి, అది కొత్త ప్రదేశం కావడంతో ఊబిలో దిగబడి “నన్ను కాస్త పైకి లాగండర్రా” అంటూ నెత్తీ నోరూ మొత్తుకున్నారు.

“అయ్యా! మీరువస్తువులే పైకి తీయమన్నారు గాని, మిమ్మలను లాగమని ముందు మాకు చెప్పలేదు” అంటూ తర్కానికి దిగబోగా “మీతర్కం తెలివి తగలయ్య! ముందు నన్ను పైకి తీయండర్రా” అని బ్రతిమాలి శిష్యుల సహాయంతో బ్రతికి బైట పడ్డారు పరమానందయ్య. ఆ విధంగా ఆయనకి పెద్ద జలగండ ప్రమాదం తప్పింది.

14) చిన్నదీ - చిరునవ్వు

పరమానందయ్యగారు శిష్యులతో మఠానికి చేరుకున్నారన్నమాటే గాని ఆయనకు జ్యోతిష్యుడి “శిరఃపాద శీతలం, ప్రాప్తి జీవనాశం” అనే రెండు ముక్కలూ బాగా గుర్తిండి పోయి, దిగులు ఆవహించ సాగింది. అందుకు కారణం చెరువులో దిగినందువల్ల పాదాలు తడిసిపోవడమే గాదు! ఊబిలో దిగబడడంతో మొత్తం దేహామే చల్లబడి పోయింది.

ఓరోజు శిష్యులందర్నీ కూర్చుండబెట్టి, తన దిగులును వారితో పంచుకొనే సరికి వారికీ భోరున ఏడుపు తన్నుకొచ్చింది.

పరమానందయ్య వారినందర్నీ ఓదార్చి “నాయనలారా! విచారించకంది! ఈ భూప్రపంచం మీద ఎన్నిరోజులు బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంటే, అన్ని రోజులూ జీవించాల్సిందే! దీనికి చింతించి ప్రయోజనం లేదు. కనుక అశాశ్వతమైన నా ప్రాణం గురించి మీరు విచారించవద్దు. మిగిలిపోయిన కొద్దో గొప్పో విద్యల్ని నేను పోయే లోపుగా మీకు బోధిస్తాను” అన్నారు. 

పిడుగులాంటి గురువుగారి నీరసపు పలుకులు వినేసరికి శిష్యబృందానికీ నీరసంతో పాటు, జీవితమంటే విరక్తి కలిగిపోయింది. అందరూ కలసి ఓ చెట్టు క్రింద కూర్చున్నారు.

గురువుగారి గుణగణాలు, వారి తెలివితేటలు గురించే మాట్లాడుకుంటూ, “మన దురదృష్టం కొద్దీ మన గురువుగారు ఏమన్నా అయిపోతే, మనకు ఇలాంటి గురువుగారు మరిక దొరకరు! మన అదృష్టం ఎలా రాసిపెట్టి ఉందో కదా!” అంటూ అవేదన చెందసాగారు.

ఇంతలో ఓ అందమైన చిన్నది, ఆ చుట్టుప్రక్కల పూలుకోయాలని పూలసజ్జ చేబూని అటువైపు వచ్చింది. శిష్యులంతా ఆ అమ్మాయి వైపు చూసి, ఎవరికి తోచిన వికారపు చేష్టలు వారు చేయసాగారు.

పళ్ళు ఇకిలించే వాడొకడు, గుర్రంలా సకిలించే వాడొకడు, కళ్ళు చిట్లించే వాడొకడు. తల కాస్సేపు అడ్డంగా అంతలోనే నిలువుగా ఊపే వాడొకడు..... ఇలా ఉన్న శిష్యుల అవస్థ చూసేసరికి, ఆ పిల్లకి ఫక్కున నవ్వొచ్చింది. గలగలా నవ్వేసి వెళ్ళిపోయిందా పిల్ల.

అప్పుడు మొదలైంది శిష్యుల మధ్య గలాటా. ఆపిల్ల నన్నే చూసి నవ్విందంటే, నన్నే చూసి నవ్విందని ఎవరికివారే అనుకుంటే ఫర్వాలేదు గాని... అది తగాదాగా మారి సిగపట్లదాకా వెళ్ళింది.

పరమానందయ్య గారికి విషయం బోధపడక, శిష్యులిలా ఒకరి పిలక పుచ్చుకొని ఒకరు ఎందుకు తన్నుకుంటున్నదీ అర్ధంకాక, ఆరాతీస్తే “పిల్లనవ్వు' అని తేలింది.

“ఓహో! ఇదా సంగతి.ఇప్పుడే ఆ సంగతి తేల్చేస్తా' నంటూ, గురువుగారు ఆ పిల్ల దగ్గరికెళ్ళి “ఎవర్ని చూసి నవ్వేవు చిట్టితల్లీ? చెప్పమ్మా! వాళ్ళు తన్నుకు ఛస్తున్నారు” అంటూ అమాయకంగా అడిగే సరికి ఆ పిల్లకి ఇంకా నవ్వు వచ్చింది.

“మీ శిష్యుల పేర్లు నాకు తెలీదు. అంతా కలిసి రకరకాల కోతి చేష్టలు చేస్తుంటే, అందులో ఒకాయన అచ్చం కోతిలాగానే తోచాడు నాకు. దాంతో నాకు నవ్వాగింది కాదు” అని జవాబు చెప్పి అక్కడ్నించి నవ్వుకుంటూ వెళ్ళింది.

ఆమాటనే గురువుగారు తన శిష్యులతో అనేసరికి, ఈసారి వాళ్ళమధ్య ఇంకో తగువు ప్రారంభమైంది. “నేనే కోతిని అంటే నేనే కోతిని” అంటూ వాళ్ళిలా కొత్త పల్లవి అందుకొని కొట్టుకునే సరికి “ఓరి వానరాధములారా! అంతా కోతులే! మీ అందర్నీ చూసి నవ్వింది. మీలో తక్కువ వాళ్ళెవరూ లేరూ” అని సర్ది చెప్పాక గాని, పరమానందయ్య శిష్యులు శాంతించలేదు.

15) పరశురామ ప్రీత్యర్దం - ఉత్సవం

వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు జోరుగా జరగడం సర్వసాధారణమైన విషయం. పరమానందయ్య గారి ఆశ్రమానికి, కూతవేటు దూరంలో ఉన్న ఓ సంపన్నుని ఇంట వివాహం జరుగుతోంది.

ఆ రాత్రి వంటశాల వద్దనో, ఇతరత్రా కారణాల వల్లనో ప్రమాదం వాటిల్లి ఇల్లు అంటుకుంది. పెద్దపెద్ద మంటల్లో ఆకాశమే ఎరుపెక్కి పోయింది. వెదురు కర్రలు కాల్తూ ఫటఫట శబ్జ్బాలు వినిపించ సాగాయి.

ఓ శిష్యుడా దహనకాండ చూడబోయి వెళ్తూ వెళ్తూ దారిలో ఒక ఆసామిని “అదంతా ఏమిటి?” అని అడిగాడు. ధనికులపైన ఆ ఆసామికి గల కసికొద్దీ “ఆ! ఏముందీ? అది పరశురామ ప్రీత్యర్థం...” అనేసి చక్కాపోయాడు. అయ్యో!... మంటలు అంటుకొని వాళ్ళెంత క్షోభ పడుతున్నారో కదా! అనే ఆలోచన రాకపోయిందా శిష్యునికి.

"మంటలు చూసి కూడా మాటాడకుండా పోతున్నన్నాడు మతిలేని శిష్యుడు"

దూరాన్నుంచే ఆ దృశ్యం చూసి ఆ ఆసామి చెప్పిన మాటలనే వల్లె వేస్తూ ఆశ్రమానికి తిరిగొచ్చేశాడు. ఆ మంటల దృశ్యం యొక్క అందం, అతడి హృదయం మీద ముద్రపడింది.

16) పట్టుబట్టల దహనం

ఒకానొక సందర్భంలో పరమానందయ్య గారి పట్ల అపరిమితాభిమానంతో, రాబోయే శ్రీరామ నవమి వేడుకలలో ఐదు రోజులపాటు పురాణ కాలక్షేపం విన్పించాలంటూ దగ్గరి గ్రామస్తులు కొందరు పట్టుపట్టారు. వారి కోరికను కాదనలేక పరమానందయ్య గారు పత్నీ సహితంగా వేంచేస్తా మన్నారు. “అంతకంటే మహద్భాగ్యమా?” అని గ్రామస్తులు వారందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు.

పరమానందయ్య గారికి నిజానికి రామాయణగాధ ఒక్కటే బాగా చెప్పడం వచ్చు! భారత భాగవతాల జోలికెళ్ళక ముందే, తండ్రిగారు కాలం చేసినందున, అవి అంతతమాత్రం స్వంత ప్రజ్ఞతో అలవర్చుకున్నవే గనుక, పురాణం చెప్పమని ఎవరడిగినా “రామాయణం చెప్పుకుందాం” అనేవారు. సందర్భం కూడా కలసి వచ్చింది గనుక్క ఐదురోజులే అన్నారు గనుక మొదట్లోని బాల, అయోధ్యా కాండలూ, చివర్లోని యుద్ధకాండా వదిలేసి అరణ్య - సుందరకాందలు ఎత్తుకున్నారు.

ఓరోజు పురాణంలో లంకాదహన ఘట్టం వివరించి చెప్తూ “ఆ ప్రకారం.... హనుమ చూచిరమ్మంటే కాల్చివచ్చినాడు అనే వాక్యంతో ఆ నాటికి పురాణం చాలించారు. ఆ మాట శిష్యుల మనస్సు మీద బాగా ముద్రపడిపోయింది. చివరిరోజు గ్రామస్తులు గురువు గారికి పట్టు పీతాంబరాలు, గురుపత్నికి పట్టుచీరా రవికె పెట్టి దక్షిణతో సహా సత్మరించారు.

తిరుగు ప్రయాణమై వెళ్ళాక ఓరోజు పట్టుబట్టలు అరబెట్టారు గురుపత్ని. “నాయనా! బట్టలు ఆరాయో లేదో చూడు” అన్నారు. అంతే! ఆ శిష్యుడికి పురాణంలో ఓరోజు ముక్తాయింపుగా గురువుగారు అన్న వాక్యం గుర్తుండిపోయి, చూద్దానికి వెళ్లినవాడు పట్టుబట్టకు నిప్పంటించి చక్కావచ్చాడు. క్షణాల్లో అంత విలువైన పట్టుబట్టలూ భస్మం అయిపోవడం చూసి, నోట మాటరాక నిలువు గుడ్లేసుకుని చూస్తూ పేరిందేవి “మళ్ళీ జన్మలో ఇలాంటివి సంపాదించగలమా?” అని కంటతడి పెట్టింది.

17) మక్కికి మక్కీ జవాబు

రోజులు యధా ప్రకారం దొర్లిపోతుండగా, ఆ ఏడాది తన తండ్రి సచ్చిదానందుల వారి శ్రద్ధకర్మ (తద్దినం) ఘనంగా చెయ్యాలని పరమానందయ్య గారికి అనిపించింది. పేరిందేవి కూడా మామగారి అనురాగ వాత్సల్యాలు గుర్తుకు తెచ్చుకొని “తప్పకుండా వారి ఆత్మ శాంతించేలా ఘనంగా చేసి తీరాలి” అని తీర్మానించింది.

ఆరోజు నవకాయ పిండివంటలూ వండించి, విష్ణుస్థానంలో అదనంగా మరొక బ్రాహ్మణుని కూడా అర్చించి, భోక్తలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపేశాక, శిష్యులతో సహా గురువుగారు భోజనాలకు కూర్చున్నారు.

వంటలు ప్రశస్తంగా కుదిరి అందరూ వారి అభిరుచుల మేరకు భోజనం ఆస్వాదిస్తుండగా “గురువుగారూ! మీరేదైనా ఒక జ్ఞానబోధ... వజ్రపు తునకలాంటిది ఈ సందర్భంగా మాకు చెప్పాలి. దాన్ని జీవితాంతం మర్చిపోకుండా అనుసరిస్తాం” అన్నారు.

అంత అకస్మాత్‌గా అడిగే సరికి వారికున్న మిడిమిడి జ్ఞానంవల్ల ఏం చెప్పాలో తోచక తడబడి పోయారు. అయినా శిష్యులకి ఏదో ఒకటీ చెప్పాలి. లేకుంటే వాళ్లూరు కొనేలాగ లేరని “నాయనలారా పెద్దలు ఏపని చెప్పినా వెంటనే చేయాలి. అలా చెప్పారు కదా అని పనిమీద పని పెట్టుకోరాదు. అందువల్ల కష్టాలు రావచ్చు!” అన్నారు వివరంగా. అది వాళ్ళ బుర్రల్లో బలంగానే నాటుకుపోయింది. 

కొన్నాళ్ళ తర్వాత, గురుపత్నికి తండ్రిగారి ఆరోగ్యం బాగులేదని కబురు రాగా, ఆమె ఆందోళన పడి ఆశ్రమంలోని పనుల ఒత్తిడివల్ల తాను వెళ్ళలేక ఓ శిష్యుడిని పిలిచి తన తండ్రిగారిని చూసి రమ్మంది.

ఆ శిష్యుడు ఇలా వెళ్ళి, అలా సాయంత్రానికి తిరిగి వచ్చేశాడు. చెప్పిన పని తక్షణం చేసిన ఆ శిష్యుని తీరు గురువమ్మ గారికి అనందం కలిగించినా, తండ్రిగారి సంగతి తెలుసుకోవాలని ఆందోళనగా అడిగింది.

“ఒరే అబ్బీ! మా నాన్నగారు కులాసాయేనా?” అని.

“నేను ఆయన్ని పలకరించనే లేదండీ” వినయంగా అన్నాడా శిష్య పరమాణువు.

“అదేమిటయ్యా! ఊరు దేనికి వెళ్ళినట్టు?” అని చిరాకు పడిందామె.

“అలా అంటారేమిటమ్మా! ఊరికే వెళ్ళి రమ్మన్నారు గాని, పలకరించమని చెప్పలేదు కదా! స్వంత ఆలోచనలతో పనిమీద పని పెట్టుకో కూడదని ఆనాడు గురువుగారు చెప్పలేదా?” అన్నాడు.

“అదొక పెద్దపనా? ఎటూ వెళ్ళినవాడివి..... ఆమాట కనుక్కోక పోతే నువ్వెళ్ళి ప్రయోజనం ఏమిటి?”

“ఏమో! అదంతా నాకు తెలీదు”.

“మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మక్కీకి మక్కీ ఏపని చెప్తే అదే చేస్తానంటే ఎలాగర్రా?” అని విసుక్కుంది గురుపత్ని.

“సర్లే నువ్వు మళ్ళీవెళ్ళి ఈసారి మా నాన్నగారిని కలుసుకుని మంచి చెడ్డలు అడిగి రా!”

“అయ్యో దేవుడా! మీరు మళ్ళీ రెండు పనులు చెప్తున్నారు మధ్యలో ఇంకోపని చెప్తున్నారు.

“నేను ఒక్కటే కదరా చెప్పాను”

“ఊరు వెళ్ళడం ఒకపని కదా! మధ్యలో ఇంకో పని ఎందుకు? ఆయన్ని కలవాలి, మంచి చెడ్డలు అడగాలి”.

“దేనికదే లెక్కబెట్టుకుంటారా? ఇదంతా ఒకటే పని”

“లేదండి! రెండూ వేర్వేరు పనులు. అంతే! గురువుగారు చెప్పింది జీవితాంతం పాటించాల్సిందే!”

“ఆ మాత్రానికి ఊరికెళ్ళడం దేనికి?”

“అయితే అది మానేసి, మీ తండ్రిగారి మంచిచెడ్డలు ఒక్కటే అడగనా?”

“నీకు చెప్పడం నావల్ల కాదురా! అక్కడికి వెళ్ళనిదే ఆయన మంచి చెడ్డలు ఎలా తెలుస్తాయి?”

“చూశారా! రెండూ వేర్వేరు పనులు అని మీరే అంటున్నారు. గురుపత్నికిక వాదించే ఓపిక లేక నెత్తీనోరు మొత్తుకుంది.

18) పరమానందయ్య పరలోక యాత్ర

మధ్యాహ్నం భోజనాలయి గురువుగారు, గురుపత్ని ఇతర  శిష్యులంతా కునుకు తీస్తున్న తరుణంలో ఓ శిష్యుడు తటాలున లేచి ఇంటికి ఓ మూల నిప్పంటించాడు. “ఏమిట్రా ఈపని?” అని అడిగిన ఇంకో శిష్యుడికి “ఆమాత్రం తెలీదా? ఉక్కబోత చంపేస్తుంది. ఎండాకాలం వేడి. “ఉష్ణం ఉష్టేన శీతలం” అని కదా గురువుగారు చెప్పారు. ఈ వేడికి తగ్గ జవాబు అగ్గినిప్పే అని నిప్పెట్టేశాను” అన్నాడు అంటించిన శిష్యుడు మహా సంబరంగా.

గ్రామం యావత్తూ ఈ అతికెలివి శిష్యుడి పనికి నొచ్చుకుని గురువు గారి మీదున్న గౌరవం వల్ల శిష్యులకు మెత్తగా చివాట్లు వేసి సరిబెట్టి తన్నకుండా వదిలారు. ఆశ్రమంతో పాటు తమ ఇళ్ళూ ఎక్కడ అంటు కుంటాయోనని వాళ్ళంతా ఏకమై మంటలను ఆర్బడంలో సాయపడ్డారు. అప్పటికే ఆశ్రమంలో మూడొంతులు తగులడిపోయింది. కట్టుబట్టలు మిగిలాయి.

దీంతో గురువు గారికి సగం ప్రాణం పోయింది. బెంగతో రోజులెలా గడపాలా అనే దిగులుతో ఇంకా నీరసించి పోయారు. శిష్యులందరూ ఆ స్ఫితిలో గురువుగార్ని చూడలేక బావురుమన్నారు. ఇంతకాలం వారి అమాయకత్వాన్ని భరిస్తూ వచ్చిన పరమానందయ్యకీ వారి పత్నికీ, “ఒకవేళ తామేదైనా అయితే, వీరి పరిస్థితి ఏమిటి?” అనే దిగులూ ఎక్కువైంది. దిగులు తగ్గడానికి కొన్నాళ్ళు పుట్టింటి కెళ్ళోస్తానని వెళ్ళింది గురుపత్ని.

ఓరోజు ఉన్నట్టుండి ఆయన కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి ఇంకేముందీ? ఆయనకు అంత్యకాలం సమీపించిందని నిర్ధారించేసిన శిష్యులు ఆయన్ని శ్మశానానికి మోసుకు పోయారు.

“అంత హఠాత్తుగా ఎలా జరిగిందబ్బా?” అనుకుంటూ “ఈ శిష్యుల తెలివి తెల్లారినట్టే ఉంది” అని పుట్టింట్లో ఉన్న పేరిందేవికి కబురందించి, తీరా శ్మశానానికి వచ్చి చూస్తే, మాట పడిపోయి కళ్ళనీళ్ళు కారుస్తున్న గురువుగారు వారి కంటబడ్డారు. 'ఇది పక్షవాత లక్షణంలా ఉందే' అని అనుభవజ్ఞుడొకడు అనడంతో, శిష్యులు చేసిన నిర్వాకానికి మండిపడి గ్రామస్తులు వార్ని ఊళ్ళోకి ఆశ్రమానికి రానివ్వక అట్నుంచటే వెళ్ళగొట్టారు. అంతే!.

********** COMPLETED     *********

తెనాలి రామకృష్ణ కథలు

అక్బర్ బీర్బల్ కథలు

పరమానందయ్య శిష్యుల కథలు

పంచతంత్ర కథలు

Post a Comment

Previous Post Next Post